ఎల్ఆర్ఎస్ పోవాలంటే టీఆర్ఎస్‌ను ఓడించాలి

by Shyam |
ఎల్ఆర్ఎస్ పోవాలంటే టీఆర్ఎస్‌ను ఓడించాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: నగర ప్రజలపై ప్రభుత్వం వేసిన ఎల్ఆర్ఎస్ భారం పోవాలంటే అధికార టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిది దాసోజు శ్రవణ్ పిలుపునిచ్చారు. మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులు వారి కష్టార్జితంతో ప్లాట్లు కొన్నారని, కానీ ప్రభుత్వం మాత్రం ఎల్ఆర్ఎస్ పేరుతో వారి నుంచి భారీ స్థాయిలో పెనాల్టీల రూపంలో వసూలు చేయాలనుకుంటున్నదని, ఈ భారం నుంచి విముక్తి పొందాలంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించడమే సరైన మందు అని అన్నారు. గాంధీ భవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నదానికి నాలుగైదు రెట్లు అదనంగా ఎల్ఆర్ఎస్ పేరుతో వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, దీన్ని ప్రజలు భరించే స్థితిలో లేరన్నారు. ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసే తీరులో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాజకీయ గిమ్మిక్కులు చేస్తున్నారని, ఆస్తిపన్నులో 50% మినహాయింపు ఇస్తూ ప్రకటన చేశారని, కానీ పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ప్రజలపై ఆర్థిక భారం లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే 50% మాఫీ చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం దీన్ని 100% ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నగరంలో వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించే కార్యక్రమం పూర్తిగా ముగిసినట్లు మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రకటించారని, అదే నిజమైనట్లయితే ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ ‘మీ సేవ’ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎందుకు ప్రకటించిందని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. ఆ ప్రకారం బాధితులందరికీ ఇంకా నగదు సాయం అందలేదని ప్రభుత్వం ఒప్పుకుంటున్నట్లే గదా అని ప్రశ్నించారు. వరద బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయడంలో ప్రభుత్వం విఫలమైందని, అందుకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులే నిదర్శనమని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed