తెలంగాణ విద్యాశాఖలో గొడవలు..!

by Anukaran |
తెలంగాణ విద్యాశాఖలో గొడవలు..!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల్లో సర్దుబాటు పేరుతో జరిగిన డిప్యూటేషన్లు విద్యాశాఖలో లొల్లికి దారి తీస్తున్నాయి. పదో తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకుని తరగతుల నిర్వహణ, సిలబస్ పూర్తి చేసేందుకు విద్యాశాఖ ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లను డిప్యూటేషన్​పై ఆయా స్కూళ్లకు పంపింది. ఐతే ఫిబ్రవరి 1న హైస్కూళ్లు తెరిచే వరకు స్తబ్ధుగా ఉన్న డిప్యూటేషన్ల లొల్లి, ప్రాథమికోన్నత పాఠశాలలను తెరవడంతో మరింత ముదిరింది. సర్దుబాటు పేరుతో ప్రాథమికోన్నత పాఠశాలల టీచర్లను హైస్కూళ్లకు పంపగా, యూపీఎస్​లలో ఉపాధ్యాయులు ఉండీ లేనట్టుగా మారిన పరిస్థితి. దీంతో చాలా స్కూళ్లలో కనీసం చదువు చెప్పే పరిస్థితి లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఆదేశాలు బేఖాతరు

పదో తరగతి విద్యార్థులకు సిలబస్ పూర్తి చేసి, వారిని పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ఎంఈవోలు తమ పరిధి ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన ఎస్ జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండిట్ గ్రేడ్ -2 లను ఉన్నత పాఠశాలలకు డిప్యూటేషన్ పై పంపారు. అది చాలదన్నట్లు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను తాత్కలికంగా సర్దుబాటు చేశారు. దీంతో కొంత మంది టీచర్లు మారుమూల ప్రాంతాల పాఠశాలలకు వెళ్లలేమని చెతులెత్తేస్తున్నారు. రవాణా సౌకర్యం ఉన్న పాఠశాలలకు పంపాలని ఎంఈవోలపై ఒత్తిడి తెస్తున్నారు. మరికొంతమంది ఉపాధ్యాయ సంఘాల నేతలతో పైరవీలు చేస్తూ, జిల్లా యంత్రాంగం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. దీనంతటికీ కరోనా కాలంలో పక్కన పెట్టిన విద్యా వలంటీర్లను ఈ విద్యాసంవత్సరంలో కొనసాగించకపోవడమే అసలు కారమణమని తెలుస్తోంది.

యూపీఎస్‎లకు టీచర్లు కరువు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 439 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 245 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. వాటిలో లాక్​డౌన్​కు ముందు 1200 మందికి పైగా విద్యా వలంటీర్లు పనిచేశారు. కొంతకాలంగా విద్యాశాఖలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించకపోవడం, చాలామంది టీచర్లు ఉద్యోగ విరమణ పొందడంతో విద్యా వలంటీర్లతోనే పాఠాలు చెబుతూ నెట్టుకొస్తున్నారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 2021-22 విద్యా సంవత్సరానికి 1,031 వలంటీర్లు అవసరమని జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాల విద్యాశాఖ సంచాలకులకు నివేదిక సమర్పించారు.

కానీ, కరోనా నేపథ్యంలో ఆగస్టు లో విద్యాశాఖ రెగ్యూలర్ టీచర్లతోనే ఆన్ లైన్ క్లాసులను నిర్వహించింది. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లను డిప్యూటేషన్​పై పంపిన సమయంలో ఆయా పాఠశాలలు ఇంకా తెరుచుకోలేదు. ఇటీవల అవి ఓపెన్​కాగా, అక్కడ పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లు లేకుండా పోయారు. పదో తరగతి విద్యార్థుల కోసం విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం సరైందే అయినా యూపీఎస్​లలో చదువుకుంటున్న విద్యార్థుల విద్యా సంవత్సరాన్ని ఫణంగా పెట్టడం సరికాదని విద్యార్థులు తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

క్యాన్సల్​ చేయాలంటూ ఒత్తిళ్లు

డిప్యూటేషన్ పై వెళ్లిన కొంత మంది టీచర్లు అక్కడ పనిచేయమమని మొండికేస్తున్నట్లు తెలిసింది. పలు ఎమ్మార్సీల్లో డిప్యూటేషన్ క్యాన్సిల్ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. అయితే వారు ఈ విద్యా సంవత్సరం మొత్తం పాఠశాలకు వెళ్లకపోతే తమ పరిస్థితి ఏంటని ఎంఈవోలు లబోదిబోమంటున్నారు. తరచూ పాఠశాలలకు డుమ్మా కొట్టే కొంత మంది ఉపాధ్యాయుల బాగోతం డిప్యూటేషన్​తో బహిర్గతం అయ్యే పరిస్థితి ఉందని భయపడిపోతున్నారని తెలిసింది. ఇక కొంత మంది ఎంఈవోలకు ఇది అస్త్రంగా మారిందని టీచర్లకు దగ్గరగా ఉండే గ్రామాలు, రవాణా సౌకర్యం ఉండే పాఠశాలలకు డిప్యూటేషన్​ కోసం లోలోపల భేరసారాలు జరిగినట్లు సమాచారం. ఐతే డిప్యూటేషన్ల వల్ల విద్యా వ్యవస్థకు విఘాతం కలుగుతుందని, దీనిని రద్దు చేయాలని డెమోక్రటిక్ టీచర్స్​ఫెడరేషన్​జిల్లా విద్యాశాఖాధికారులను కోరింది. అయితే దీనిని పాఠశాల విద్యాశాఖా సంచాలకుల నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయో వేచి చూడాల్సిందే మరి.

Advertisement

Next Story