ప్రతిభకి గుర్తింపు దక్కేనా?

by Anukaran |
ప్రతిభకి గుర్తింపు దక్కేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉమ్మడి రాష్ట్రంలో 2012, 2014 ల్లో మొదటిసారి రాత పరీక్ష ద్వారా వీఆర్వో, వీఆర్​ఏ ఉద్యోగం పొందారు. గంపెడాశతో సంపాదించుకున్న ఉద్యోగాలు కాస్త ఇటీవల రెవెన్యూ శాఖలో తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలు, సంస్కరణల కారణంగా ఒడుదుడుకులకు లోనవుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఎనిమిదేళ్లుగా అవే ఉద్యోగాలు సర్వస్వం అని భావించి, పథకాలను ప్రజలకు అందించేందుకు శ్రమించి, నేడు వ్యవస్థలో ఉద్యోగ భద్రత, భవిష్యత్తు పదోన్నతులు, ఇన్నాళ్లు అందించిన సేవల విషయంలో గుర్తింపు లేదని 800 మంది వీఆర్వోలు, 2900 మంది వీఆర్​ఏలు మానసికంగా కుంగిపోతున్నారు. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందోనని వేచి చూస్తున్నారు.

ఏ శాఖలో విలీనం..?

ప్రస్తుతం రెవెన్యూ శాఖలోని వీఆర్వోలు, వీఆర్​ఏలను వ్యవసాయ శాఖలో ఏఈఓల పర్యవేక్షణ సహాయక సిబ్బంది, పురపాలక శాఖలో వార్డు ఆఫీసర్లు, జలవనరుల శాఖలో లష్కర్లుగా నియమిస్తారని రోజుకో ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రత్యక్ష నియామకం ద్వారా నియమించబడి విధులు నిర్వర్తిస్తున్న రెవెన్యూ శాఖలోని క్షేత్రస్థాయి సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖలో పలు చట్టాల అమలు, ప్రభుత్వ పథకాల అమలుకు విస్తృతమైన సమాచార సేకరణ వంటి వాటితో పాటు క్షేత్రస్థాయిలో సర్కార్​ ప్రతి కార్యానికి తీవ్రంగా శ్రమించిన తమకు ప్రభుత్వ గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు.

ఉన్నత విద్యావంతులే అధికం..

రెవెన్యూ శాఖలో డైరెక్టు రిక్రూట్​మెంట్​ ద్వారా నియమితులైన వీఆర్వోలు, వీఆర్​ఏల్లో అత్యధికులు బీటెక్, పీజీ, పీహెచ్డీ, ఇతర ఉన్నత సాంకేతిక విద్యార్హతలు కలిగిన వారే. వారంతా సిబ్బంది కొరత ఉన్నచోట రికార్డు అసిస్టెంట్లు, కంప్యూటర్​ ఆపరేటర్లుగా మొదలుకొని జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లుగా విధులు నిర్వర్తిస్తూ గ్రీవెన్సులు సకాలంలో పరిష్కరించి ప్రభుత్వ పనితీరు విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఒకే బ్యాచ్​కు చెందిన వీరిలో ఉమ్మడి రంగారెడ్డి, కరీంనగర్ వంటి జిల్లాల్లో వీఆర్ఏలు వీఆర్వోలుగా, వీఆర్వోలు సీనియర్ అసిస్టెంట్లు/ గిర్దావర్లుగా కూడా పదోన్నతి పొందారు. అప్పటి మిగతా 8 ఉమ్మడి జిల్లాలో మాత్రం వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇన్నాళ్ల సర్వీసుకి ప్రభుత్వం ఎలాంటి భద్రత కల్పిస్తుందో తెలియక, భవిష్యత్తులో సర్దుబాటు చేయబోయే శాఖల్లో తమ పాత్ర, జాబ్ చార్టు, పదోన్నతులు, సర్వీస్ ప్రొటెక్షన్ వంటి విధి విధానాలు తెలియక సతమతం అవుతున్నారు.

పదోన్నతుల ఆశ..

జనవరి నెలాఖరులోగా అన్ని శాఖల్లో ఉద్యోగులకి పదోన్నతులు కల్పించాలని ఒకవైపు సీఎం ప్రకటించడం, మరో వైపు సీఎస్ ఆ దిశలో పదోన్నతుల ద్వారా ఖాళీల భర్తీ విషయమై శరవేగంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో రెవెన్యు శాఖలో ప్రత్యక్ష పద్ధతి ద్వారా నియామకం పొందిన అర్హులైన వీఆర్వోలు, వీఆర్​ఏలు ఎదురు చూస్తున్నారు. పదోన్నతుల ద్వారా ఖాళీ అయిన స్థానాల్లో ముందుగా సర్దుబాటు చేయాలని కోరుతున్నారు. రాత పరీక్ష ద్వారా నియమితులై అర్హులైన వేర్వేరు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల్లో సర్దుబాటు చేయాలని వేడుకుంటున్నారు. ఇదే విషయమై గతంలో పలుమార్లు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్, మహమూద్ అలీలను ప్రత్యేకంగా కలిశారు. సీఎస్ సోమేశ్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కూడా ఎప్పటికప్పుడు వినతులు అందజేస్తున్నారు. వారి మొరపై ప్రభుత్వం కూడా పలుమార్లు స్పష్టమైన హామీలు కూడా ఇచ్చిందని, ఇప్పుడు వాటిని నెరవేర్చి అర్హులైన వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్లు, వీఆర్​ఏలకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు సర్దుబాటు చేయాలని కోరుతున్నారు.

Advertisement

Next Story