నాగర్ కర్నూల్‌లో పరిస్థితి ఉద్రిక్తం

by Sridhar Babu |
Dharna1
X

దిశ, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం జమిస్తాపూర్ గ్రామంలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఓ బలమైన ఇనుప రాడ్ తో అదేగ్రామనికి చెందిన 65 ఏళ్ల దళితుడిని చావ బాదాడు. దీంతో ఆస్పత్రి పాలైన బాధితుడు మంగళవారం మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తెలకపల్లి మండలం జమిస్తాపూర్ గ్రామానికి చెందిన కుప్పె రాములు అనే 65 ఏళ్ల వ్యక్తి ఈ నెల 10న తన మేక పిల్లలకు గ్రాసం కోసం అటుగా వెళ్తున్నాడు. అదే సమయంలో గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి ఎదురుపడి పాత కక్షలు మనసులో పెట్టుకొని బలమైన ఇనుపరాడ్డుతో చావ బాదాడు. వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.

దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎస్సై కూడా రెడ్డి సామాజిక వర్గం కావడంతో పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాములు మృతిచెందాడు. దీంతో బుధవారం జిల్లా ఆసుపత్రి ముందు ప్రధాన రహదారిపై బీఎస్పీ, సీపీఎం, సీపీఐ ప్రజా సంఘాలు రాస్తా రోకో నిర్వహించాయి. కేవలం బాధితులు దళితులు కావడం వల్లే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అతి కిరాతకంగా గడ్డపారతో దాడిచేసి చంపారని ఆరోపించారు. రక్షించాల్సిన పోలీసులు కూడా కులాల వారీగా న్యాయం చేస్తారా అంటూ ప్రజా సంఘాల నేతలు ప్రశ్నించారు. దీంతో సుమారు గంటన్నరపాటు ట్రాఫిక్ పూర్తిగా అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన డీఎస్పీ మోహన్ రెడ్డి వారితో మాట్లాడి కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు. అలసత్వం వహించిన ఎస్సై మాధవరెడ్డిని ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు తెలిపారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story