ఫోన్ ద్వారానే ఫిర్యాదులు : సీపీ అంజనీకుమార్

by Shyam |
ఫోన్ ద్వారానే ఫిర్యాదులు : సీపీ అంజనీకుమార్
X

దిశ, క్రైమ్ బ్యూరో : కరోనా.. పోలీస్ శాఖపై తీవ్ర ఫ్రభావం చూపుతోంది. నిత్యం ప్రజల మధ్యనే విధులు నిర్వహించే వందలాది మంది పోలీసులకు పాజిటివ్ కేసులు నిర్థారణ కావడంతో ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రతి పోలీస్ స్టేషన్లలో కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు పదే పదే చెబుతున్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదులను ఫోన్ల ద్వారానే తీసుకోవాలని నిర్ణయం తీసుకోవాలని హైదరాబాద్ నగర సీపీ అంజనీకుమార్ అధికారులకు ఆదేశించారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ మరింత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, పోలీసులు సైతం కరోనా బారిన పడుతుండగా ఫిర్యాదుల కోసం ప్రజలు పోలీస్ స్టేషన్లకు రావాల్సిన అవసరం లేదని, సంబంధిత పోలీస్ స్టేషన్ లకు ఫోన్ ద్వారా సమాచారం అందించినా కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అత్యవసరం అయితేనే పోలీస్ స్టేషన్లకు రావాలని సీపీ అంజనీకుమార్ శనివారం విలేకరుల సమావేశంలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

జాగ్రత్తల మధ్యనే విధులు..

హైదరాబాద్ నగర కమిషనరేట్ పరిధిలో గతేడాది 3800 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ రాగా, 41 మంది మృతి చెందారు. ప్రస్తుతం సెకండ్ వేవ్ లో కూడా ఇప్పటి వరకు 700 మంది పోలీసులకు కరోనా సోకింది. రాచకొండ పరిధిలో 250 కేసులు నమోదయ్యాయి. ఈ పరిసిత్తుల్లో పోలీసులు విధులను వదిలి క్వారంటైన్ కావాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్లలో తప్పనిసరిగా కోవిడ్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల మధ్యనే పోలీసులు విధులు చేపట్టాలన్నారు. అందుకు ‘బీ సేఫ్ ఎట్ వర్క్’ పద్దతిలో పనిచేసేందుకు 20 సూచనలను చేశారు. సిబ్బందికి కరోనా లక్షణాలు కన్పించగానే అధికారులకు తెలియజేసి క్వారంటైన్ కావాలని, మనం ఉంటున్న ప్రదేశంలో వివిధ రకాల వస్తువులను టచ్ చేసిన తర్వాత చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలని, మాస్క్ ను ప్రాపర్ ఫిట్టింగ్ చేయాలని, ప్రతి ఒక్కరూ పర్సనల్ హైజెనిక్ ఉండేలా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు.

6 అడుగుల దూరంలో..

పోలీసులు విధులు సందర్భంగా పోలీస్ స్టేషన్లలో ఉండే సమయలో సిబ్బంది ఒక్కొక్కరి మధ్య కనీసం 6 అడుగులు దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో మధ్యాహ్న భోజనం సమయంలో సిబ్బంది అంతా బ్యాచ్ లు వారీగా భౌతిక దూరం పాటిస్తూ లంచ్ చేయాలన్నారు. ప్రజలు మత పరమైన సమావేశాలతో పాటు ధర్నాలు, ఆందోళనలకు దూరంగా ఉండాలన్నారు. ఎవరినైనా అరెస్టు చేసే సమయంలో పోలీసులు పట్టుకోవాల్సి రావడంతో కరోనా వ్యాపించే ప్రమాదం లేకపోలేదన్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే విజిటర్స్ కు పట్ల కూడా కోవిడ్ నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారితో పాటు ప్రెగ్నెన్సీ కలిగిన మహిళా అధికారులకు వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా డ్యూటీలు వేయనున్నట్టు చెప్పారు. ముఖ్యంగా విధులు ముగించిన అనంతరం పూర్తి స్థాయిలో జాగ్రత్తల తర్వాత మాత్రమే కుటుంబ సభ్యులతో సమీపంగా మెలగాలని అన్నారు.

ఫోన్ ద్వారానే ఫిర్యాదు..

పోలీస్ శాఖలో ఇప్పటికే 100 డయల్ తో పాటు ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలు పోస్టు చేసిన ఫిర్యాదులను స్వీకరించి కేసులు నమోదు చేస్తున్నారు. కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ నెంబరు, స్థానిక పీఎస్ పెట్రోలింగ్ వాహనం నెంబరు ద్వారా ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదులు చేయాలని సూచించారు. ప్రజలు పోలీస్ స్టేషన్ కు రాకుండానే దాదాపుగా 90 శాతం సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అత్యవసరం అయితేనే.. మిగతా 10 శాతం పోలీస్ స్టేషన్ కు రావాలని అన్నారు. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 24 గంటల పాటు కోవిడ్ కంట్రోల్ రూమ్ ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. కోవిడ్ కంట్రోల్ రూమ్ నెంబర్ 9490 616 780 ద్వారా సంప్రదించాలని అన్నారు. ఇదే నెంబరుకు వాట్సాప్ ద్వారా తమ సమస్యలను తెలియజేయవచ్చన్నారు. అంతే కాకుండా 040- 2343 4343 ల్యాండ్ లైన్ నెంబరులో కూడా ప్రజలు ఫోన్ చేసి తమ సమస్యలను చెప్పవచ్చన్నారు.

Advertisement

Next Story