ఎంపీ శశిథరూర్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు

by Shamantha N |
ఎంపీ శశిథరూర్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: ఫేస్‌బుక్ (facebook) వ్యవహారం ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మధ్య రచ్చగా మారింది. ఇప్పటికే ఇరు పార్టీల ఎంపీలు ఒకరిపై మరొకరు సభా హక్కుల సంఘం నోటీసులు ఇచ్చుకున్న విషయం విదితమే. తాజాగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ స్థాయీ సంఘం చైర్మన్ శశిథరూర్‌పై ఇద్దరు బీజేపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు.

విద్వేష పూరిత ప్రసంగాలపై ఫేస్‌బుక్‌ను వివరణ కోరుతామని బుధవారం శశిథరూర్ బాహాటంగా ప్రకటించారు. ఈ విషయం తొలుత స్థాయీ సంఘం సభ్యులమైన తమతో చర్చించకుండా మీడియాతో మాట్లాడటంపై బీజేపీ ఎంపీలు రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్, నిషికాంత్ దూబే… స్పీకర్ ఎదుట అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐటీ స్థాయీ సంఘం చైర్మన్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నిబంధనలు ఉల్లంఘించారని, ఈ విషయమై స్పీకర్‌కు లేఖ రాశానని కేంద్ర మంత్రి, కమిటీలో సభ్యుడైన రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తెలిపారు.

ఫేస్‌బుక్‌ ప్రతినిధులను కమిటీ ముందుకు పిలవడాన్ని వ్యతిరేకించడం లేదని, కానీ, తొలుత కమిటీ సభ్యులతో చర్చించాల్సి ఉండగా, అందుకు బదులుగా మీడియా ముందు ప్రకటన చేశారని రాథోడ్ పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మరో ముందడుగు వేసి పార్లమెంటరీ స్థాయీ సంఘం చైర్మన్ పదవి నుంచి శశిథరూర్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story