అధికార పార్టీలో పోటీ… ఎవరికి బీ ఫాం దక్కనుందో..?

by Shyam |   ( Updated:2021-04-21 04:29:28.0  )
అధికార పార్టీలో పోటీ… ఎవరికి బీ ఫాం దక్కనుందో..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో జరుగుతున్న పుర ఎన్నికల్లో అధికార పార్టీలో టికెట్ల పోటీ నెలకొంది. 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల పరిధిలోని 248 వార్డుల్లో మొత్తం 3630 నామినేషన్లు దాఖలైతే… వీటిలో 1314 నామినేషన్లను టీఆర్ఎస్ నుంచే వేశారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండటం, కేసీఆర్ చరీష్మాతో ఎన్నికల్లోనైనా విజయం సాధిస్తుందనే ధీమాతో ఆశావాహులంతా పార్టీ తరుపున నామినేషన్లు వేశారు. మరోవైపు గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్లు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఎవరికి ఖరారు చేయాలనే వడపోత మొదలైంది. అభ్యర్థుల గెలుపు అవకాశాలు, ఉద్యమ నేపథ్యం, టికెట్​ ఇవ్వకపోతే పార్టీ మారితే ఏమైన నష్టం జరుగుతుందా? అనే అంశాలన్నింటినీ అంచనా వేస్తున్నారు. ఈ నెల 22న నామినేషన్ల ఉపసంహరణ, తుది జాబితా ప్రకటించనుండగా… పార్టీ తరుపున అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియ వేగవంతమైంది.

ఖమ్మం,వరంగల్ కార్పొరేషన్లతో పాటు నకిరేకల్, చెన్నూరు, అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల మున్సిపాలిటీలకు ఈనెల 30న ఎన్నికలు జరుగనున్నాయి. నామినేషన్ల పక్రియ, పరిశీలన పూర్తయింది. మంగళవారం అభ్యంతరాలను స్వీకరించారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ పార్టీ నుంచే అధిక నామినేషన్లు వచ్చాయి. ఎవరికి పార్టీ బీ ఫామ్ ఇవ్వాలనే దానిపై పార్టీ ముఖ్య నేతలు, వార్డు ఇన్ చార్జులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరో వైపు కార్యకర్తలతో వార్డుల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, చేపట్టబోయే పనులను ప్రజలకు వివరించాలని సూచిస్తున్నారు. దీంతో పాటు అసంతృప్త నేతలు ఉంటే వారిని బుజ్జగించే పనిలో నేతలు నిమగ్నమయ్యారు.

సిద్ధిపేటలో ఖరారు..

సిద్దిపేట మున్సిపల్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి హరీష్ రావు వార్డుల అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు. 43 వార్డులను అభ్యర్థులను ప్రకటించినప్పటికీ బి ఫాం మాత్రం ఇవ్వలేదు. చివరి వరకైనా బి ఫాం వస్తుందని భావించిన ఆశావాహులతో కలిసి మొత్తం 210 నామినేషన్లు దాఖలయ్యాయి. వారి ఉపసంహరణకు రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. మిగతా నాలుగు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో అభ్యర్థులను ప్రకటించలేదు.

వరంగల్ కార్పొరేషన్ కు 706 నామినేషన్లు

వరంగల్ కార్పొరేషన్‌లో గులాబీ నేతలు పోటీపడి నామినేషన్లు వేశారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు, ముగ్గురు దాఖలు చేశారు. 66 వార్డులకు 706 నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక్కో వార్డుకు సుమారు 11 మంది చొప్పున టీఆర్​ఎస్​ నుంచే నామినేషన్ వేశారు. ఖమ్మం కార్పొరేషన్‌లోని 60 వార్డులకు 163 మంది అంటే ఒక్కో వార్డుకు ముగ్గురు నామినేషన్ వేశారు. ఇక జడ్చర్ల మున్సిపాలిటీలోని 27 వార్డులకు 63 నామినేషన్లు, నకిరేకల్ లోని 20 వార్డులకు 81 నామినేషన్లు, అచ్చంపేట మున్సిపాలిటీలోని 20 వార్డులకు 60 నామినేషన్లు, కొత్తూరులోని 12 వార్డులకు 31 నామినేషన్లు, సిద్దిపేటలోని 43 వార్డులకు 210 నామినేషన్లు వచ్చాయి. ఈసారి టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య గతంలో కంటే రెట్టింపు అయింది.

కొంత సమయం ముందే అధికారిక ప్రకటన

టీఆర్ఎస్ పార్టీలో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఇన్‌చార్జులు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈనెల 22న ఉపసంహరణ, అభ్యర్థుల తుదిజాబితాను అధికారులు ప్రకటించనున్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీలో పోటీ ఎక్కువగా ఉండటంతో ముందస్తుగా అభ్యర్థులను ప్రకటిస్తే ఇతర పార్టీలకు వలస వెళ్తే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని భావించిన నేతలు కొద్ది సమయం ముందు ప్రకటించి, బీఫారాలు అప్పగించే అవకాశాలున్నాయి. దీంతో పార్టీకి నష్టనివారణతో పాటు గెలిచే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రెబల్స్‌ను బుజ్జగిస్తూనే… పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే తీసుకునే చర్యలను కూడా హెచ్చరిస్తున్నారు. పార్టీ నిర్ణయాన్ని కాదంటే వారిపై వేటు వేయాలని భావిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.

Advertisement

Next Story