భగ్గుమంటున్న ధరలు.. తినేదెట్ల.. కొనేదెట్ల?

by Shyam |   ( Updated:2021-02-27 11:09:11.0  )
Commodity prices
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిత్యావసరాల ధరలు పేదల నడ్డి విరుస్తున్నాయి. కరోనా ముందు ధరలన్నీ అందుబాటులో ఉన్నా.. లాక్‌డౌన్ తర్వాత అమాంతం పెరిగిపోయాయి. నూనెలు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏం కొనాలో.. ఏం తినాలో పాలుపోక జనం అల్లాడుతున్నారు. అన్ని సరుకులపై దాదాపు 20 శాతంపైగా ధరలు పెరిగాయి. దీంతో పెట్రోల్, డీజిల్‌ని ప్రత్యక్షంగా వాడని పేదలకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. పొట్ట కూటి కోసం సైతం అప్పు చేయాల్సి వస్తోందని, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు వసూలు చేసే వ్యాట్‌ను తగ్గిస్తే కొంత ఉపశమనం కలుగుతుందని సామాన్య ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

చమురు ధరలు పెరగడమే కారణం

దేశంలో ఏ వస్తువునైనా ప్రజలకు చేర్చేందుకు ట్రాన్స్‌పోర్టుపైనే ఆధార పడాలి. రెండు నెలలుగా చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్‌కు ముందు లీటర్ పెట్రోల్ రూ.76గా ఉంటే.. అమాంతం రూ.95 కు పెరిగింది. డీజిల్ రూ.70గా ఉండేది.. రూ.88కు చేరింది. రేట్లు ఇంతలా పెరగడంతో ట్రాన్స్‌పోర్టు కంపెనీలు రేట్లు పెంచేశాయి. దీంతో నిత్యావసరాల ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగాయి. వీటితో పాటు సొంత వాహనం లేని మధ్యతరగతి వారికి టాక్సీ ప్రయాణం ఇప్పుడు భారంగానే మారింది. టాక్సీ డ్రైవర్ల సంఘం చమురు రేట్లు పెరిగాయని కి.మీకు తీసుకునే వ్యయాన్ని పెంచింది. పాల సహకార సంఘాలు పాల రేట్లు పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఈ ధరలు మార్చి మొదటి వారం నుంచే అమలయ్యే అవకాశాలున్నాయి. వీటికి తోడు తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీకి అందించే రాయితీ డీజిల్‌పై వ్యాట్‌ను పెంచింది. దీంతో ప్రయాణ ఛార్జీల ధరలను పెంచనున్నారు. ఇది అమలైతే ప్రయాణికులపై మరింత భారం పడనుంది.

ఏం కొనలేని పరిస్థితి

గతంలో వంద రూపాయలకే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి. ప్రస్తుతం రెండు, మూడు రోజులకు మాత్రమే వస్తున్నాయి. వీటితో పాటు నెలకు సరిపడా సరుకులు తెచ్చుకోలేని పరిస్థితిలో ధరలున్నాయి. వంటనూనె, పప్పుల ధరలు పెరిగి సామాన్యుడికి అందని ద్రాక్షగా మారాయి.
– కట్కూరి జ్యోతి, గృహిణి, వరంగల్

వస్తువు కరోనాకి ముందు ధర ప్రస్తుత ధర (రూపాయల్లో..)

వంటనూనె 111 150
కందిపప్పు 85 115
సోనామసూరి బియ్యం 950 1200
పెసర్లు 88 100
చింతపండు 140 180
గోధుమపిండి 35 50
పాలు 48 55

Advertisement

Next Story

Most Viewed