ఏపీలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు ?

by srinivas |
weather
X

దిశ, ఏపీ బ్యూరో: పశ్చిమ బంగాళాఖాతం..దానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం కేంద్రంగా ఈ నెల 15లోగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రాబోయే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావం వల్ల ఈనెల 17 వరకు ఉత్తరకోస్తా, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఉత్తరాంధ్ర తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణం వైపు ఉందని, దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడొచ్చని వివరించింది.

మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 48 గంటల్లో తుఫాను బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావం తూర్పుగోదావరి జిల్లాపై పడే అవకాశం ఉందని తెలియడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అల్పపీడన ప్రభావంతో 17వరకు తూర్పు తీరంలో 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, వర్షం పడే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. డివిజన్‌, మండల కేంద్రాల్లో రక్షణ, సహాయక శాఖల సమన్వయంతో కాకినాడ కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబరు 1800 425 3077ను ఏర్పాటు చేశారు. అలాగే రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

Next Story