ఇంకా నీటిలోనే 200 కుటుంబాలు..!

by Shyam |   ( Updated:2020-11-06 21:16:02.0  )
ఇంకా నీటిలోనే 200 కుటుంబాలు..!
X

గతనెల వరదలతో గ్రేటర్ హైదరాబాద్ అంతా ఆగమాగమైంది. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ ధోరణిపై, అధికారుల పనితీరుపై అప్పటి నుండి ఇప్పటి వరకు విమర్శలు వస్తూనే ఉన్నాయి. 20 రోజులైనా ఇంకా కొన్ని కాలనీళ్లు నీళ్లలోనే ఉండడం ప్రభుత్వ పనితనాన్ని తెలియజేస్తోంది. పీర్జాదీగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మరో మూడు కాలనీళ్లు ఇంకా నీళ్లలోనే ఉన్నాయి. బురదలో ఉండలేక 20 కుంటుంబాలు ఇళ్లు వదిలిపోగా, మరో 20 కుటుంబాలు దిక్కులేక అక్కడే ఉంటున్నాయి. మంత్రి ఆదేశాలను సైతం అధికారులు లెక్కజేయకుండా తమ కాలనీలను పట్టించుకోవడం లేదని అధికారుల నిర్లక్ష్యంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దిశ, మేడిపల్లి :

పీర్జాదీగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సుమా రెసిడెన్సీ కాలనీ, ప్రగతినగర్, అయోధ్య నగర్ కాలనీలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. వరద బురద, వాసనతో ఒక వైపు, పాకురుతో మరోవైపు స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వరదలు, అవి తీసుకొచ్చిన వ్యర్థాలతోనే 20 రోజులకు పైగా కాలనీల ప్రజలు సహజీవనం చేస్తున్నారు. రోజుల తరబడి నిలిచిన నీటితో అనారోగ్యం, ప్రమాదాలు పొంచి ఉన్నందున తప్పని పరిస్థితుల్లో బాధిత కుటుంబాలు ఇతర ప్రాంతాల్లోని అద్దె ఇండ్లలో కాలం వెళ్లదీస్తున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు వచ్చారు. హామీలిచ్చారు. వెళ్ళి పోయారు. కానీ, అవి మాత్రం ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఫలితంగా కాలనీవాసులకు కష్టాలు తప్పడం లేదు. మూడు కాలనీల్లో 200 కుటుంబాలు ఉన్నాయి. అందులో దాదాపు 180 ఇండ్లవాళ్లు ఖాళీ చేశారు. అద్దెకు వెళ్ళలేక తప్పదనుకున్నవారు సుమారు 20 కుటుంబాలు నీళ్లు, బురద మధ్యలో ఉన్న ఇళ్లలోనే తీవ్ర ఇక్కట్లతో గడుపుతున్నారు. ఇప్పటికీ కాలనీల్లోని నీటిని తొలగించే ప్రయత్నం పాలకులుగానీ, అధికారులుగానీ చేయకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి ఆదేశాలనూ పట్టించుకోవట్లే..

‘కాలనీల్లోకి వరద నీరు రాకుండా శాశ్వత పరిష్కారిస్తాం. భూగర్భ డ్రైనేజీ ద్వారా వరద నీరును నేరుగా మూసీనదిలోకి పంపే ఏర్పాటు చేస్తాం’ అని వరదల సమయంలో స్థానికులను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి కేటీఆర్ చెప్పారు. చెరువు నీళ్లు కాలనీల్లోకి రాకుండా వెంటనే చూడాలని ఇరిగేషన్, మున్సిపల్ అధికారులను మంత్రి ఆదేశించారు. కానీ, ఇప్పటికీ ఆయన ఆదేశాలను అధికారులు పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. కనీసం రోగాలు రాకుండా బ్లీచింగ్ పౌడర్‌ను చల్లలేదంటే అధికారులు వరద బాధితులను ఏ మాత్రం పట్టించుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులతో అద్దె ఇళ్లలో ఉండలేక, కాలనీల్లో నీళ్లు, బురద మధ్య బతకలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే సమస్య పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు.

Advertisement

Next Story