అక్రమ ఇళ్ల నిర్మాణాలపై కలెక్టర్ కొరడా

by Sridhar Babu |
house-in-warangal1
X

దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వ్యాపార, వాణిజ్య కేంద్రమైన కాటారంలో ని అసైన్డ్ భూములలో అనుమతులు లేకుండానే కొనసాగుతున్న ఇళ్ల నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా కొరడా ఝుళిపించారు. కాటారం మండలంలోని గారేపల్లి గ్రామానికి సరిహద్దుగా 353 జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఇబ్రహీంపల్లి పంచాయతీ పరిధిలో పోతులవై గ్రామ శివారులో అసైన్డ్ భూములు ప్రభుత్వ అనుమతులు లేకుండా జోరుగా కొనసాగుతున్న ఇళ్ల నిర్మాణాలకు జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో హుటాహుటిన జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత అక్కడికి చేరుకుని మండల టాస్క్ ఫోర్స్ అధికారులు నడుస్తున్న ఇళ్ల నిర్మాణం నిలిపివేశారు. నిర్మాణ వస్తువులను పంచాయతీ కార్యాలయానికి తరలించారు.

కొన్ని నెలల క్రితం ఎమ్మార్వో, జిల్లా కలెక్టర్ బదిలీ కావడంతో ఈ మధ్యకాలంలో అసైన్డ్ భూములలో అనుమతులు లేకుండానే గారేపల్లి, పోతులవాయి, కొత్తపల్లి, గంగారం ఎక్స్ రోడ్ గ్రామాలలో జోరుగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పలువురు వ్యక్తులు కలెక్టర్ భావేష్ మిశ్రా దృష్టికి తీసుకెళ్లగా నిర్మాణాలను నిలిపి వేయాలని ఆదేశించారు. ఫలితంగా అక్రమంగా ఇళ్లను నిర్మిస్తున్న పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసైన్డ్ భూముల్లో యథేచ్ఛగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం పట్ల పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మండలాల్లో ప్రభుత్వ భూములు తక్కువగా ఉన్నాయని, వాటిని అన్యాక్రాంతం కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినట్లు, ఇళ్ల నిర్మాణాలు కొనసాగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆంజనేయులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed