‘నర్సరీల్లో మొక్కల సంరక్షణకు శ్రద్ధ వహించాలి’

by Shyam |   ( Updated:2020-05-08 10:41:09.0  )
‘నర్సరీల్లో మొక్కల సంరక్షణకు శ్రద్ధ వహించాలి’
X

దిశ, నల్లగొండ:
గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. తిప్పర్తి మండలం రాయినిగూడెం, మాడ్గులపల్లి మండలం కొత్తగూడెం, దామరచర్ల మండలం రాజగట్టు గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలను శుక్రవారం సందర్శించారు. నర్సరీల్లో మొక్కల పెంపకం, జెర్మినేషన్, గ్రామ గ్రీన్‌ప్లాన్, వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్డుల పనుల ప్రగతిపై మండల, గ్రామ అధికారులతో చర్చించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామంలో పచ్చదనం పెంపొందించాలని, హరితహరం కార్యక్రమంలో పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు ప్రభుత్వం ప్రతి గ్రామపంచాయతీకి ఒక నర్సరీ ఏర్పాటు చేసిందన్నారు. హరితహరంపై సీఎం ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారని, గ్రామ గ్రీన్‌ప్లాన్ ప్రకారం మొక్కలు పెంచుతూ మొక్కలు చనిపోకుండా మొక్కలకు వాటరింగ్ చేయాలని సూచించారు. మొక్కలు బాగా పెరిగేలా జీవామృతం పట్టించాలన్నారు. మొక్కలు ఎక్కడైనా తక్కువగా ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ కార్యదర్శి, ఎంపీడీఓలు మొక్కల బాధ్యత వహించాలన్నారు. అనంతరం గ్రామంలో వైకుంఠధామాలు, కంపోస్ట్ షెడ్డుల నిర్మాణాల పనుల ప్రగతి గురించి తెలుసుకున్నారు. నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని, సిమెంట్, హార్డ్ వేర్ దుకాణాలకు, ఇసుక సరఫరాకు ఇబ్బంది లేదని చెప్పారు. కొత్త గూడెం గ్రామంలో వైకుంఠధామం భూమి రిజిస్ట్రేషన్ పూర్తిచేసి నాలుగు రోజుల్లో చేసి నిర్మాణాలు మొదలు పెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్‌‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణు వర్ధన్, ఎంపీడీఓలు, తహశీల్దార్లు, ఎంపీఓలు, సర్పంచ్లు, గ్రామ అధికారులు పాల్గొన్నారు.

Tags: Nursery, collector prashant patil, Inspect

Advertisement

Next Story