యాదాద్రి పేరిట వసూళ్ల దందా.. టార్గెట్ ఫిక్స్ చేస్తున్న అధికార పార్టీ నేతలు

by Anukaran |   ( Updated:2021-10-26 23:58:15.0  )
యాదాద్రి పేరిట వసూళ్ల దందా.. టార్గెట్ ఫిక్స్ చేస్తున్న అధికార పార్టీ నేతలు
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : యాదాద్రి శ్రీ లక్ష్మి నర్సింహస్వామి పేరిట విరాళాల దందా మొదలైంది. విరాళాల కోసం అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు షురూ అయ్యాయి. కాంట్రాక్టర్లు, వ్యాపారులకు ఫోన్లు చేసి పెద్ద మొత్తంలో విరాళాలు అందజేయాలని హుకుం జారీ చేస్తున్నారు. విరాళాలు ఇచ్చేందుకు నిరాకరించే వారిని పరోక్షంగా బెదిరిస్తున్నారు. దీంతో కాంట్రాక్టర్లు, పేరున్న వ్యాపార సంస్థల యాజమానులు బెంబేలెత్తిపోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లో ఇప్పటికే వసూళ్ల పర్వం ఊపందుకుంది.

యాదాద్రి లక్ష్మి నృసింహుడి దివ్యక్షేత్రాన్ని ఈ నెల 19వ తేదీన సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్ 125 కిలోల పసిడి విరాళాల సేకరణకు పిలుపునిచ్చిన విషయం విధితమే. స్వామి వారి ఆలయంతోపాటు విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేయించాలని నిర్ణయించినట్లు ఆ పర్యటనలో సీఎం ప్రకటించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం విమాన గోపురానికి స్వర్ణ తాపడంలో పాలు పంచుకన్న వారితో చర్చించగా125 కిలోల బంగారం అవసరమవుతుందని లెక్క తేలిందని, ఇందుకోసం దాదాపు రూ.65 కోట్లు అవుతుందన్నారు.

నిధుల సేకరణకు రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయితీలు, 3600 వార్డులు, 142 మున్సిపాలిటీలను భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. అంతేకాకుండా తమ కుటుంబం నుంచి తొలి విరాళంగా కిలో 16 తులాల బంగారాన్ని ఇస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు భారీ విరాళాలను ప్రకటించారు. కొంత మంది తన కుటుంబంతోపాటు ఇతర మార్గాల ద్వారా కూడా బంగారాన్ని సేకరించి ఇస్తామని పేర్కొన్నారు. దీంతో కొందరు బడా నేతలు యాదాద్రి పేరిట విరాళాలు వసూళ్లు చేస్తున్నారు. సాధారణంగా స్వామివారిపై భక్తిభావం ఉన్న వారంతా తమకు తోచినంత విరాళాలను ఇస్తున్నారు. అయితే, అధికార పార్టీ నేతలు ఇదే అదునుగా భావించి కాంట్రాక్టర్లు, బడా వ్యాపారుల నుంచి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వేలు.. లక్షల కోసం ఒత్తిళ్లు..

యాదాద్రి ఆలయానికి విరాళాలివ్వడం భక్తుల మనోభీష్టానికి సంబంధించిన అంశం. తమకున్న ఆర్థిక స్థోమతను బట్టి భక్తులు, వ్యాపారులు చందాలిస్తుంటారు. అయితే ఆలయానికి బంగారు తాపడం ముసుగులో బలవంతపు వసూళ్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. మేడ్చల్ జిల్లాలో కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారాలు నిర్వహించే షాపుల యాజమానులందరూ రూ.25వేల నుంచి రూ. లక్ష వరకు చందగా ఇవ్వాలని కొందరు నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. విరాళాల కోసం ఓ క్వారీ యాజమానిని రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. వీరితోపాటు నగరంలో పేరున్న విద్యాసంస్థలు, ఆసుపత్రులను సైతం పెద్ద మొత్తంలో చందాలు ఇవ్వాలంటూ ఒత్తిళ్లు తేవడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story