బడి ఈడు పిల్లలందరూ బడిలోనే ఉండాలి : కలెక్టర్ హరిచందన

by Shyam |   ( Updated:2021-10-26 09:05:30.0  )
బడి ఈడు పిల్లలందరూ బడిలోనే ఉండాలి : కలెక్టర్ హరిచందన
X

దిశ, నారాయణపేట : బడి ఈడు పిల్లలందరూ పాఠశాలల్లోనే ఉండాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ డి. హరిచందన అన్నారు. మంగళవారం జిల్లాలోని ఒంటరి మహిళల పిల్లలు 90 మందిని గురుకుల పాఠశాలలో చేర్పించారు. అనంతరం పిలల్లకు గురుకుల పాఠశాలల్లోని సౌకర్యాలపై అవగాహన కల్పించారు. ఒంటరి మహిళల పిల్లలను గుర్తించి వారికి గురుకుల పాఠశాలలో చదివించేందుకు సిద్ధం చేసి తీసుకువచ్చిన ఓయంఐఎఫ్ స్వచ్చంధ సంస్థ జిల్లా కో ఆర్డినేటర్‌, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్, జిల్లా సంక్షేమ అధికారులను కలెక్టర్ అభినందించారు. ఆర్థిక ఇబ్బందులు, తండ్రి లేని పిల్లలు ఎంత మంది ఉన్నా వారందరినీ గుర్తించి తీసుకువస్తే రాష్ట్రంలోని వివిధ గురుకుల పాఠశాలల్లో చదువు చెప్పిస్తామన్నారు.

ఆ తర్వాత గురుకుల పాఠశాల విద్యార్థులతో పాటు కొత్తగా చేరిన పిల్లలతో కలిసి కలెక్టర్ సహపంక్తి భోజనం చేస్తూ ముచ్చటించారు. ఇక్కడ విద్యాభ్యాసం ఎలా ఉంది. టీచర్లు ఎలా చూసుకుంటున్నారు. మెనూ వారీగా మూడు పూటలా భోజనం పెడుతున్నారా లేదా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడున్న పిల్లలు కొందరు తల్లిదండ్రులను వదిలి ఉండలేమని అనుకున్నాము గానీ, గురుకుల పాఠశాల వాతావరణం, మంచి భోజనం చూసి.. మనసు మార్చుకున్నామని కలెక్టర్‌కు వివరించారు.

పాఠశాలలోని ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలో పనిచేసే కో ఆర్డినేటర్లు అందరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా? లేదా అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని, ఏ ఒక్క విద్యార్థికీ కొవిడ్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రిన్సిపల్ దేవసేనను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, ప్రిన్సిపల్ దేవసేన, జిల్లా శిశు సంక్షేమ కమిటీ చైర్మన్ అశోక్, ఓయంఐఎఫ్ జిల్లా కో ఆర్డినేటర్ హాజమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed