9 వారాల గరిష్ఠానికి చేరిన నిరుద్యోగిత రేటు!

by Harish |   ( Updated:2020-08-19 08:29:52.0  )
9 వారాల గరిష్ఠానికి చేరిన నిరుద్యోగిత రేటు!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉద్యోగాల పరిస్థితి దారుణంగా ఉంది. చిన్న సంస్థల నుంచి పెద్ద కార్పొరేట్ కంపెనీల వరకూ అన్ని రంగాల్లో ఇదే పరిస్థితి. ఇదే అంశాన్ని పలు అధ్యయన సంస్థలు, సర్వేలు వెల్లడించాయి. తాజాగా, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) వెల్లడించిన గణాంకాలు సైతం ఇదే చెబుతున్నాయి. సీఎంఐఈ గణాంకాల ప్రకారం… దేశంలో నిరుద్యోగ రేటు 9 వారాల గరిష్ఠానికి చేరుకుందని స్పష్టం చేసింది. దేశంలో కరోనా సంక్షోభం వల్ల మారిన పరిస్థితులు ప్రజలనే కాకుండా ఉద్యోగులు, కంపెనీల యాజమాన్యాలకు కూడా ఆందోళన కలిగిస్తోంది. సీఎంఐఈ విడుదల చేసిన గణాంకాల్లో నిరుద్యోగిత రేటు భారీగా పెరుగుతోందని తేలింది.

సంక్షోభం పేరున కార్పొరేట్ సంస్థలు విధించే కోతలతో పాటు, గతంలో మాదిరిగా ఆఫీసుల్లో పని చేసుకోలేని పరిస్థితుల వల్ల నిరుద్యోగిత పెరిగిపోతోందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆగష్టు 16తో ముగిసిన వారానికి దేశవ్యాప్తంగా నిరుద్యోగిత శాతం 9 వారాల గరిష్ఠానికి చేరుకుని 9.1 శాతంగా నమోదైనట్టు తెలుస్తోంది. దీంట్లో నగరాలు, పట్టణాల నిరుద్యోగిత శాతం 9.61 శాతం ఉండగా, గ్రామీణ నిరుద్యోగిత 8.6 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా జూన్ నాటికి నిరుద్యోగిత రేటు 11.63 శాతంగా ఉంది. ఇందులో పట్టణ నిరుద్యోగిత 13.10 శాతం ఉంటే, గ్రామీణంలో 10.96 శాతంగా నమోదైంది.

ఇక, ఆగష్టు ఆరంభం నుంచే నిరుద్యోగిత దారుణంగా ఉంది. ఆగష్టు 1న 8.2 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు ఆగష్టు 18 నాటికి 9.1 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో అన్‌లాక్ దశలో సడలింపులు పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్యకలాపాలు తగ్గాయని, దీనివల్లే నిరుద్యోగిత రేటు పెరుగుతున్నట్టు సీఎంఐఈ తన నివేదికలో వెల్లడించింది. గ్రామీణంలో వ్యవసాయ కార్యకలాపాలు మందగించి, ఎక్కువ భాగం యువత మళ్లీ ఉద్యోగాల కోసం పట్టణాలకు చేరుకుంటూ ఉండటంతో నిరుద్యోగిత రేటు పెరగడానికి కారణమని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ప్రొఫెసర్ అరుప్ మిత్రా చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితులతో అంచనా వేస్తే, రాబోయే కొద్దిరోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలున్నాయని సీఈంఐఈ అభిప్రాయపడింది.

Advertisement

Next Story