- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యుత్ చార్జీలు, ఆస్తిపన్ను పెంచుతాం: కేసీఆర్
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా త్వరలో విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి. గ్రామ పంచాయతీ మొదలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి వరకు ఆస్తిపన్ను (ప్రాపర్టీ టాక్స్) కూడా పెరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఈ అంశాన్ని అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం పెంచనున్నట్లు గత కొన్ని నెలలుగా ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రే దీనిపై క్లారిటీ ఇవ్వడం గమనార్హం. నిర్ధిష్టంగా ఎప్పటి నుంచి ఈ ఛార్జీలను, పన్నులను పెంచనున్నారనే దానిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఇందుకోసం స్పష్టమైన విధివిధానాలు కూడా రూపొందనున్నాయి. తొలి టర్మ్ పన్నుభారం లేకుండా పాలన సాగించిన ప్రభుత్వం ఈ దఫా మాత్రం వడ్డింపుల పర్వాన్ని మొదలుపెట్టింది. ఆర్టీసీ ఛార్జీలతో ప్రారంభమైన ఈ వ్యవహారం మద్యం ధరల దాకా వచ్చింది. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు, గ్రామస్థాయి మొదలు రాజధాని నగరం వరకు ప్రాపర్టీ టాక్స్ పెంచేదాకా దారితీసింది.
తొలి ఐదేళ్ళ పాటు పన్నుల జోలికి పోని ప్రభుత్వం ఈ దఫా మాత్రం ఒక్కొక్కదాన్ని పెంచుతోంది. అసలే ఆర్థిక మాంద్యం పీడిస్తోందని సీఎం కేసీఆర్ గతేడాది బడ్జెట్‌లోనే చెప్పారు. ఈసారి కూడా హరీశ్‌రావు దాన్నే నొక్కిచెప్పారు. మరోవైపు కేంద్రం నుంచి చట్టబద్ధంగా రావాల్సిన నిధులు అందడంలేదని కూడా చెప్పారు. 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా తగ్గనున్నాయన్నారు. జీఎస్టీ పరిహారం చెల్లింపు కూడా కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉందన్నారు. ఇన్ని ఇబ్బందులను ఏకరువు పెట్టిన ప్రభుత్వం బడ్జెట్ సైజును పెంచింది. అయితే బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా ఆదాయ వనరులను సమకూర్చుకోవడం ప్రభుత్వానికి అనివార్యమైంది. అందుకోసం సర్కారు భూముల్ని అమ్మాలని నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల వ్యవధిలోనే రాజీవ్ స్వగృహ ఇళ్ళను వేలం వేయడానికి ఐఏఎస్ అధికారులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు.
స్వీయ ఆర్థిక వనరులపై ఆధారపడాలని ప్రభుత్వం భావించినప్పుడే పన్నులు పెంచుతుందనే సందేహాలు వెలువడ్డాయి. వీటికి తెర దించుతూ ఇప్పుడు అసెంబ్లీ వేదికగానే సీఎం కేసీఆర్ విద్యుత్ ఛార్జీలు, ప్రాపర్టీ టాక్స్ పెంచక తప్పదనే ప్రకటన చేశారు. ప్రజల్లో స్వీయ నియంత్రణ రావాల్సిన అవసరం ఉందని, అది ప్రేమతోనైనా రావాలి లేదా భయంతోనైనా రావాలని, అయితే డెబ్బై ఏళ్ళుగా ప్రేమతో ఏం జరిగిందో తెలుసునని, అందుకే ఇప్పుడు కఠిన చట్టాలను తీసుకురాలేక తప్పలేదని సమర్ధించుకున్నారు. ప్రజలకు చెప్పే చేస్తున్నాం కాబట్టి తమ ప్రభుత్వానికి ఎలాంటి భయం లేదన్నారు.
ప్రగతి పద్దుపై అసెంబ్లీలో శుక్రవారం స్వల్పకాలిక చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క లేవనెత్తిన పలు అంశాలపై ముఖ్యమంత్రి స్పందిస్తూ విద్యుత్ ఛార్జీలు పెంచే అంశాన్ని స్పష్టం చేశారు. విద్యుత్ ఛార్జీలను పెంచాల్సిన అవసరం గురించి కూడా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. రాష్ట్రంలోని రెండు డిస్కం (ఎన్‌పిడిసిఎల్, ఎస్‌పిడిసిఎల్)లు ఇంకా ఏఆర్ఆర్ రిపోర్టును సమర్పించాల్సి ఉంది. దాన్ని పరిశీలించిన తర్వాత అవి ప్రతిపాదించే రేట్లను అధ్యయనం చేసిన తర్వాత రాష్ట్ర విద్యుత్ క్రమబద్ధీకరణ సంస్థ స్పష్టమైన నిర్ణయం తీసుకోనుంది. ఛార్జీలను పెంచడానికి ముందు ప్రజాభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఆ తర్వాత పెంపుపై నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే ఆ రెండు డిస్కంలకు ఇచ్చిన గడువు ముగిసిపోయింది. అయితే మరింత గడువు కోరడంతో ఈ నెల చివరికల్లా సమర్పించడానికి గడువు లభించింది.
అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో “విద్యుత్ ఛార్జీలను పెంచుతారా అంటూ అప్పుడప్పుడూ చాలా మంది అడుగుతున్నారు. డెఫినైట్‌గా పెంచుతాం. ఎలాంటి మొహమాటం లేకుండా చెప్తున్నాం. పెంచే విషయాన్ని చెప్పడానికి శషభిషలు ఎందుకు అధ్యక్షా! నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను ఇస్తున్నాం గదా! వ్యవసాయానికి దేశంలోనే ఎక్కడా లేని విధంగా 24 గంటలూ ఉచితంగా ఇస్తున్నాం. ఇవన్నీ నడవాలంటే ఛార్జీలను పెంచక తప్పదు. పెంచకుంటే ఎట్లా? పెంచాలి గదా! లేకుంటే విద్యుత్ వ్యవస్థ నడవాలి గదా. ఆ సంస్థ కూడా బతకాలి గదా” అని వ్యాఖ్యానించారు.
పంచాయితీలు అనుకున్న ప్రకారం అభివృద్ధి చెందాలంటే ఆదాయం ఆర్జించాల్సిన అవసరం ఉంటుందని, అందుకోసం తగిన మార్గాలను ఎంచుకోక తప్పదని సీఎం వివరించారు. అందులో భాగమే ప్రాపర్టీ టాక్స్ పెంచాలనే ఆలోచన అన్నారు. కచ్చితంగా గ్రామాల నుంచి రాజధాని వరకు ప్రాపర్టీ టాక్స్‌ను పెంచుతామని అన్నారు. ఈ విషయాన్ని చెప్పడానికి భయపడాల్సిన పనేమీ ప్రభుత్వానికి లేదని, ఇలా ప్రజల నుంచి సమకూర్చుకునే ఆదాయాన్ని తిరిగి ప్రజలకే ఖర్చు పెడతామన్నారు. ఎక్కడెక్కడ ఎంత స్థాయిలో ప్రాపర్టీ టాక్స్‌ను పెంచాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, దాన్ని ప్రజలకు చెప్పే చేస్తామన్నారు.
“విద్యుత్ ఛార్జీలను, ప్రాపర్టీ టాక్స్‌ను పెంచబోతున్నాం. మాకు ఆ ధైర్యం ఉంది. ప్రతీ నయాపైసా ఆదాయాన్ని వాడుకుంటాం. తిరిగి ప్రజలకే ఖర్చుపెడతాం. ఎంత పెంచుతున్నామనేది ప్రజలకు అర్థమయ్యే తీరులో పంచాయతీ కార్యాలయం బోర్డులోనే పెడతాం. ఆ డబ్బును వారి కోసమే వినియోగిస్తాం. మేం మభ్యపెట్టాలనుకోవడంలేదు. ఉన్న మాటను స్పష్టంగా ప్రజలకు చెప్పాలనుకుంటున్నాం. టాక్సులు పెంచకుండా ఆరు చందమామలు తెస్తామని చెప్పలేదు. స్థానిక సంస్థల పాలన మొదలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వరకు వ్యవస్థ నడిచేదే, పనులు జరిగేదే ప్రజలు కట్టే పన్నుల మీద. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు కూడా ప్రజల పన్నులమీదనే ఆధారపడతాయి. ఆ నిధుల ద్వారానే ప్రజలకు సేవలందిస్తాయి” అని కేసీఆర్ అన్నారు.
ప్రజలకు అబద్ధం చెప్పాల్సిన పనేమీ లేదని, ఆ అవసరం తమ ప్రభుత్వానికి ఏముంటదని ప్రశ్నించారు. అయితే ప్రభుత్వం పెంచాలనుకుంటున్న పన్నులుగానీ, విద్యుత్ ఛార్జీలుగానీ అడ్డదిడ్డంగా పెంచబోమని, పేదలకు ఇబ్బంది కలిగించబోమన్నారు. దళితులకు, గిరిజనులకు పెంచబోమని స్పష్టం చేశారు. ఇప్పుడు కొనసాగుతున్న 101 యూనిట్ల ఉచిత విద్యుత్ యధావిధిగా ఉంటుందని, పెంపు భారం ఉండదన్నారు. వారికి రూపాయి కూడా పెంచబోమన్నారు. పేయింగ్ కెపాసాటీ ఉన్నవారికి మాత్రమే పెంచుతామన్నారు. నిరుపేదలకు ఇబ్బంది కలిగించబోమన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుంటే వ్యవస్థ నడవదని స్పష్టం చేశారు. “24 గంటలు పవర్ రావాలంటే పెంచకుంటే ఎట్లా? ఆకాశంలోంచి డబ్బులురావు గదా! క్వాలిటీ పెరగాలంటే టాక్స్ పెంచకుంటే ఎలా” అని ప్రశ్నించారు.
ప్రాపర్టీ టాక్స్ పెంపు గురించి మరింత వివరణ ఇస్తూ, ఎవరి ఇంటికి సంబంధించిన వివరాలను వారే సెల్ఫ్ డిక్లరేషన్‌గా ఇస్తే సరిపోతుందని, ప్రభుత్వ సిబ్బంది కొలతలు వేసే అవసరం ఉండదన్నారు. అయితే సెల్ఫ్ డిక్లరేషన్‌లో తప్పుడు వివరాలు ఇచ్చినట్లయితే వాస్తవ విలువకు 25 రెట్ల పెనాల్టీ, రెండేళ్ళ జైలుశిక్ష తప్పదన్నారు.