నేడు కలెక్టర్లతో సీఎం సమావేశం.. కార్లకు నో ఎంట్రీ

by Shyam |   ( Updated:2020-06-15 21:29:57.0  )
నేడు కలెక్టర్లతో సీఎం సమావేశం.. కార్లకు నో ఎంట్రీ
X

దిశ, న్యూస్ బ్యూరో: అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పంచాయితీరాజ్ అధికారులు, వ్యవసాయాధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నేడు ప్రగతి భవన్‌లో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. వ్యవసాయ రంగంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి హామీ పథకం తదితరాలకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి సుమారు 200 మందికిపైగా హాజరుకానున్నందున కొవిడ్ నిబంధనలతో పాటు అదనపు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. జిల్లాల నుంచి వచ్చే ఈ అధికారులంతా వారి కార్లను రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయం దగ్గరే పార్కు చేసుకోవాల్సిందిగా పంచాయతీరాజ్ కమిషనర్ సర్క్యులర్ జారీ చేశారు. అక్కడి నుంచి ప్రగతి భవన్‌కు ప్రత్యేకంగా బస్సుల్ని ఏర్పాటు చేశామని, వాటిలోనే అధికారులంతా చేరుకోవాలని వివరించారు. ప్రగతి భవన్‌లో కార్లు నిలుపుకోడానికి తగినంత స్థలం లేనందున ఈ ఏర్పాట్లు చేయాల్సి వచ్చిందని సర్క్యులర్‌లో వివరించారు. ఉదయం 11.30 గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సి ఉన్నా పావుగంట ముందుగానే హాల్‌లో కూర్చుని సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇందుకోసం 10.15 గంటల నుంచే రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయం దగ్గర బస్సులు అందుబాటులో ఉంటాయని, అప్పటికల్లా అందరూ అక్కడ సిద్ధంగా ఉండాలని సూచించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం డిమాండ్ దీర్ఘకాలం నుంచి ఉండగానే ఇప్పుడు పంచాయతీరాజ్ అవసరాలకు కూడా అనుసంధానం చేయాలని, ఆ పథకం కింద వచ్చే నిధులను ఈ అవసరాలకు వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఈ అంశాన్ని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వివరించే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed