ఢిల్లీకెళ్లింది రణం కోసమా.. రాజీ కోసమా?

by Anukaran |
ఢిల్లీకెళ్లింది రణం కోసమా.. రాజీ కోసమా?
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్రం మీద యుద్ధం ప్రకటించిన సీఎం కేసీఆర్ హఠాత్తుగా ఢిల్లీ విమానమెక్కడం అనేక చర్చలకు తెర లేపింది. అంతకు ముందు ఆయన రైతు సంఘాలు ఇచ్చిన ‘భారత్ బంద్’ పిలుపునకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మరుసటి రోజే కొత్త పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేసే కార్యక్రమానికి వర్చువల్‎గా హాజరవుతానని ప్రధానికి లేఖ రాశారు. వెనువెంటనే హస్తినాపురానికి పయనమయ్యారు. దీంతో కేసీఆర్ గంటల వ్యవధిలోనే ‘యూ టర్న్’ తీసుకున్నారన్న విమర్శలు వచ్చాయి. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కేసీఆర్‌ను తూర్పారబట్టారు. రణం చేయడానికి బదులుగా కేంద్రంతో కాళ్ల బేరానికి వెళ్లారని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. పాత కేసులు తిరగదోడకుండా ఉండేందుకు రాజీపడ్డారని మధు యాష్కీ ఆరోపించారు.

ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ కావడం, అమిత్ షాను సీఎం ఆయన నివాసంలో కలవడం కూడా అనుమానాలను బలపరుస్తోంది. 18 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో దేశ రాజధానికి వెళ్లిన కేసీఆర్ అక్కడ రైతులను కలిసి సంఘీభావం తెలియజేయకుండా మంత్రులతో సమావేశం కావడం గమనార్హం. వివిధ ప్రాంతీయ పార్టీల నేతలను, వామపక్ష పార్టీల నేతలను సీఎం కలుస్తారా అన్న అంశం మీదా పలు పార్టీలు దృష్టి సారించాయి.

కేసీఆర్ ఢిల్లీ పర్యటనలోని ప్రతీ కదలికను ఆయా పార్టీల నేతలు నిశితంగా గమనిస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన కేసీఆర్ అమిత్ షాతో భేటీ కావడం రాష్ట్రంలోనేగాక, కేంద్ర రాజకీయాలలోనూ ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటూ రెండేళ్ల క్రితం ప్రకటించిన కేసీఆర్ తాజాగా హైదరాబాద్ కేంద్రంగా ప్రాంతీయ పార్టీలతో ఒక ‘కాంక్లేవ్’ నిర్వహిస్తానని చెప్పారు. కేంద్రంతో అమీతుమీ తప్పదనే సంకేతాలు ఇచ్చిన రోజుల వ్యవధిలోనే కేంద్ర మంత్రులను కలవడంలోని ఆంతర్యమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పూర్తిగా ప్రైవేటు పర్యటన అంటూనే కేంద్ర మంత్రులను కలవడాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

మారని పరిస్థితి

బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య గల్లీలో (తెలంగాణలో) కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అనే వ్యాఖ్యలు రెండేళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా లక్ష్మణ్ ఉన్న సమయంలో దీనిపై పార్టీలో పెద్ద చర్చే జరిగింది. తెలంగాణలో అధికార పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ యుద్ధం చేస్తూ ఉంటే కేంద్ర మంత్రులు ఇక్కడ పథకాలను ప్రశంసిస్తుండడం, ఢిల్లీలో సమావేశమవుతుండడం పార్టీ ఎదుగుదలకు ఆటంకంగా మారిందని బహిరంగంగానే నేతలు ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికీ అదే ట్రెండ్ కొనసాగుతోంది. బండి సంజయ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చేసిన ఘాటు విమర్శల వేడి ఇంకా తగ్గకముందే ఢిల్లీలో ఆయనకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం ఇప్పుడు రాష్ట్ర నేతలను విస్మయానికి గురిచేస్తోంది.

రాష్ట్రంలో వరుస గెలుపులతో బీజేపీ బలపడుతున్న సమయంలో కేసీఆర్‌తో ఢిల్లీలో పార్టీ పెద్దలు సమావేశాలు నిర్వహిస్తుండడం ఊహించని సంకట పరిస్థితుల్ని తెచ్చిందని, వేగంగా ఎదుగుతున్న సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు సడెన్‌గా బ్రేక్ వేసినట్లయిందని బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఇంతకాలం టీఆర్ఎస్‌పై చేసిన పోరాటమంతా వృథా అయిందని, ఇకపైన రాష్ట్రంలో ఏ ముఖం పెట్టుకుని తిరగాలన్న ఆవేదనను ఆ నేత వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అమిత్ షా మొదలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జేపీ నడ్డా లాంటివారంతా వచ్చి ప్రచారం చేసిన తర్వాత దాదాపు 50 డివిజన్లలో గెలిచామని, ఇప్పుడు టీఆర్ఎస్‌తో రాష్ట్రంలో దూకుడుగా ఢీకొట్టే అవకాశం లేకుండా పోయిందన్న బాధను వ్యక్తం చేశారు. ఇటీవల బీజేపీలో చేరిన విజయశాంతి సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరుగుతుండగానే ఢిల్లీలో ఈ పరిణామం చోటుచేసుకోవడాన్ని వారు గుర్తుచేశారు.

భయపడిందెవరు?

కేసీఆర్ తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్‌కు బీజేపీ భయపడిందా? లేక కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని భయపడి కేసీఆరే రాజీకి వచ్చారా అనే చర్చలూ జరుగుతున్నాయి. గతంలో తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ను విలీనం చేస్తానంటూ మాట ఇచ్చి దాని నుంచి యూ టర్న్ తీసుకున్నారని, ఇప్పుడు బీజేపీ విషయంలోనూ రాజకీయ ప్రయోజనం కోసం ఢిల్లీ పర్యటనకు శ్రీకారం చుట్టారని కాంగ్రెస్ నేత ఒకరు గుర్తుచేశారు. తెలంగాణలో ఇకపైన కాంగ్రెస్ బలపడే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఈ రెండు పార్టీలూ ఏకమవుతున్నాయని, రైతాంగం ఇక్కడ తిరగబడే పరిస్థితి రాకముందే కేసీఆర్ ద్వారా బీజేపీ చక్రం తిప్పాలనుకుంటోందని, అందులో భాగమే ఆ రెండు పార్టీల తాజా నాటకం అని ఆ నేత అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లే పేరుతో ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ చర్చలకు ఢిల్లీ వేదికగా మారింది. ప్రైవేట్ టూర్ అని ఢిల్లీ వెళ్ళిన ప్రతీసారి ఇలాంటి చర్చలు చోటుచేసుకోవడం గమనార్హం. గతంలో నోట్ల రద్దు, జీఎస్టీ, రాష్ట్రపతి ఎన్నిక, ఆ తర్వాత ఉప రాష్ట్రపతి ఎన్నిక, ట్రిపుల్ తలాక్ లాంటి ఎన్నో అంశాల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు తెలియజేసిన టీఆర్ఎస్ ఈసారి వ్యవసాయ చట్టాలను బహిరంగంగా వ్యతిరేకించినా తాజాగా ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో సానుకూల వాతావరణంలో చర్చలు జరపడం సరికొత్త రాజకీయ పరిణామాలకు శ్రీకారం చుట్టినట్లయింది.

Advertisement

Next Story

Most Viewed