- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ ఝలక్.. కేటీఆర్ వర్గంలో చెదిరిన కల
దిశ,వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ మరోసారి పాత పాటే పాడారు. ఎప్పటి లాగే తానే సీఎం అని మరోసారి బల్ల గుద్ది చెప్పారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏదో కొత్త వార్త వస్తుందని అనుకున్న వాళ్లకు సీఎం కేసీఆర్ చావు కబురు చల్లగా చెప్పారు. మరో పదేండ్లు నేనే రాజు నేనే మంత్రి అని స్పష్టం చేశారు. అయితే కేటీఆర్ సీఎం అన్న వార్తలపై ఆయన ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నారు. ఇన్ని రోజుల డ్రామా వెనక అసలు కారణం ఏంటీ…తెలియాలంటే రీడ్ దిస్ స్టోరీ
కేటీఆర్ సీఎం కాబోతున్నారు…దానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఆదివారం నాటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాబోతుందని ఇటు టీఆర్ఎస్ నేతలు…అటు మీడియా మేధావులు సీఎం ప్రెస్‌మీట్ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఎప్పటి పాటే పాడారు. తాను ఆరోగ్యంగానే ఉన్నాననీ.. మరో పదేండ్లు తానే సీఎంగా ఉంటాననీ మరో సారి కుండ బద్దలు కొట్టారు. కొత్త సీఎం అంటూ ఎందుకు అలా మాట్లాడుతున్నారని పనిలో పనిగా పార్టీ క్యాడర్‌కు చివాట్లు పెట్టారు. సీఎం మార్పుపై ఇకపై ఎవరూ మాట్లాడొద్దని నాయకులను సున్నితంగా హెచ్చరించారు.
అయితే గత పదిహేను రోజులుగా కేటీఆర్ సీఎం అంటూ ఇటు మీడియాలోను అటు ప్రజల్లోనూ హోరెత్తి పోయింది. కేటీఆర్‌ను సీఎం చేసేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయని ఇక ప్రకటన ఒక్కటే తరువాయి అని ఎవరికి వారే లెక్కలు వేసుకున్నారు. మంత్రులు కూడా ఒకరితో ఒకరు పోటీ పడి తమ స్వామి భక్తిని నిరూపించుకునేందుకు తహతహలాడారు. తన కోటరీలో ఇంత తతంగం జరుగుతున్నా సీఎం కేసీఆర్ మౌనంగా ఉన్నారు. మౌనం అర్థాంగికారం అనే రేంజ్‌లో ఆయన ఊరకుండి పోయారు. కాగా ఇన్ని రోజుల ఆయన మౌనం వెనక ఆంతర్యం ఏంటనేది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.
అటు దుబ్బాక ఓటమి, ఇటు జీహెచ్ఎంసీలో ఎదురుగాలి వీయడంతో టీఆర్ఎస్ పార్టీపై ప్రతిపక్షాలు పదునైన విమర్శలు సంధిస్తున్నాయి. ఇటు పార్టీ క్యాడర్‌లోనూ సీఎం కేసీఆర్‌పై విశ్వాసం సన్నగిల్లుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ గ్రహించినట్టు సమాచారం. అందుకే ఈ పరిణామాలను సైడ్ ట్రాక్ చేసేందుకు మరో సారి కేటీఆర్ సీఎం అనే వాదనను తెరపైకి తెచ్చేలా ఆయన వ్యూహ రచన చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. అనుకున్నట్టుగానే ఆ పార్టీ నాయకులు కూడా ఆ వాదాన్ని ప్రజల్లోకి మోసుకుపోగలిగారు. ఇప్పుడు కేటీఆర్ సీఎం అంశం తెరపైకి రావడంతో పాత ఓటములు అన్నీ పక్కకుపోయాయి.
కాగా ఈ ప్రచారాన్ని ఎక్కువ కాలం కొనసాగిస్తే కొత్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే సీఎం పదవికి కేటీఆర్ కన్నా ఈటల బాగా సరిపోతారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లాంటి నాయకులు బహిరంగంగానే సూచనలు చేశారు. మరో వైపు బీసీ నాయకుడైతే బెటర్ అంటూ ఈటలకు మద్దతు పెరుగుతోంది. ఇలాంటి సందర్భంలో ఈ వాదం మరి కొన్ని రోజులు కొనసాగితే మరి కొందరు నేతలు తెరపైకి వచ్చే అవకాశాన్ని కొట్టి పారేయలేం. అదే జరిగితే పార్టీలో అంతర్గత విభేదాలు ఏర్పడి పార్టీ భవిష్యత్తు నాశనమయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ ప్రచారాన్ని ఎక్కువ కాలం కొనసాగించవద్దని సీఎం కేసీఆర్ అనుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఈ ప్రచారానికి ఆదివారం ఆయన ముగింపు పలికారని అభిప్రాయపడుతున్నారు.