‘కుర్చీ వేసుకుని సమస్య పరిష్కరిస్తా అన్నావ్ కదా కేసీఆర్’..

by Sridhar Babu |   ( Updated:2021-08-06 03:47:22.0  )
cpiml
X

దిశ, గుండాల : ప్రపంచ ఆదివాసీల దినోత్సవం ఆగస్టు 9ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ పోడు భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని కాచన పల్లి జగ్గు తండాలో గుండాల సబ్ డివిజన్ నాయకులు పూనెం రంగన్న, జర్పుల కిషన్ మాట్లాడుతూ.. హరితహారం పేరుతో కేసీఆర్ ప్రభుత్వం పోడు భూములను లాక్కునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. భూములను లాక్కునే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

పోడు భూముల పరిరక్షణ కోసం ఈ నెల 9వ తేదీన ఇల్లందు మండలం కొమవారం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈనెల 11వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ముందు జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల సమయంలో పోడు భూముల సమస్య తనకు తెలుసునని.. ఇల్లందు ప్రాంతంలో కుర్చీ వేసుకుని పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని, ఇంత వరకు ఒక్క పట్టా ఇవ్వకపోగా ఆదివాసీ గిరిజనులు, ఇతర పేదలు సాగుచేసుకుంటున్న భూములను హరితహారం పేరుతో మొక్కలు నాటుతున్నారని విమర్శించారు. పోడు భూముల సమస్యను పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అట్టికం శేఖర్, ఎనగంటి రమేష్, ఎనగంటి లాజర్, ఎనగంటి చిరంజీవి, బొమ్మెర వీరన్న, బన్సీ, మాలోత్ శీను, రామదాసు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed