చివరి ఆయకట్టు వరకూ నీరందాలి: కేసీఆర్

by Anukaran |
చివరి ఆయకట్టు వరకూ నీరందాలి: కేసీఆర్
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలోని చివరి ఆయకట్టు వరకూ సాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని, దీనికి మించిన ప్రాధాన్యత ప్రభుత్వానికి మరొకటి లేదని, ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. నదుల నుంచి వచ్చే నీటిని ప్రాజెక్టుల ద్వారా తొలుత చెరువులు, ఆ తర్వాత రిజర్వాయర్లు, చివరకు ఆయకట్టుకు సరఫరా చేయాలని, వేసవి కాలంలో సైతం చెరువులు, రిజర్వాయర్లు నీటితో నిండి ఉండేలా ప్లాన్ చేయాలని అధికారులకు సూచించారు. నీటిపారుదల శాఖలో మేజర్, మైనర్, చిన్నతరహా లాంటి అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందికి తేవాలని, సాగునీటి సమర్ధ నిర్వహణ కోసం ఈ శాఖను పునర్ వ్యవస్థీకరించాలని స్పష్టం చేశారు. ప్రగతి భవన్‌లో ఆదివారం జరిగిన సమీక్ష సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి రాష్ట్రంలో నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టుల ద్వారా వచ్చే నదీ జలాలను వీలైనంత ఎక్కువగా వ్యవసాయ భూములకు అందించే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని వరద కాలువకు వీలైనంత ఎక్కువ ఓటిలు ఏర్పాటు చేసి, ఇతర స్కీములతో సాగునీరు అందని ప్రాంతాల చెరువులను నింపాలన్నారు. కథలాపూర్ నుంచి కూడా ప్రతినిధులను ఈ సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు.

భూగర్భ జలమట్టం పెరగాలి
గోదావరి, కృష్ణా నదులపై ఎంతో ఖర్చుచేసి, ఎన్నో అవరోధాలను అధిగమించి ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను నిర్మిస్తున్నదని, పెండింగ్ ప్రాజెక్టులను చాలా వేగంగా పూర్తి చేసిందని సీఎం గుర్తుచేశారు. ఉద్యమ స్పూర్తితో చెరువులను పునరుద్ధరించిందని, దీని ఫలితం ప్రజలకు అందాలంటే వ్యవసాయ భూములకు సాగునీరు అందించడమే మార్గమన్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల వల్ల ఏర్పడిన నీటి లభ్యతను సంపూర్ణంగా వినియోగించుకోవాలని, నీటిని చేరవేయడానికి వీలుగా కాల్వల సామర్థ్యం ఉందో లేదో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచాలని, పక్కా ప్రణాళికా ప్రకారం నీటిని సరఫరా చేయాలన్నారు. వానాకాలంలో లభించే నీటిని పెద్ద మొత్తంలో నిల్వ చేసుకోవడం ద్వారా చెరువులు, చెక్ డ్యాములు ఎప్పుడూ నిండే ఉండాలన్నారు. భూగర్భ జలమట్టం పెరిగి రైతులు దాదాపు రూ. 45వేల కోట్ల వ్యయం చేసి వేసుకున్న బోర్లకు నీరందుతుందని, మరోవైపు కాల్వలు, చెరువుల ద్వారా వ్యవసాయం సాగుతుందన్నారు.

ఎస్సారెస్పీని పరిస్థితులకు తగ్గట్టుగా వాడుకోవాలి
కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా ఎస్ఆర్ఎస్పీ వరకు రెండు టీఎంసీల నీటిని తరలించే వెసులుబాటు కలిగిందని, సుమారు 30లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండించే అవకాశం లభించిందని, వరద కాలువ, కాకతీయ కాలువ, అప్పర్ మానేరు, మిడ్ మానేరు, లోయర్ మానేరు ఏడాది పొడవునా నిండే ఉంటాయన్నారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో ఎప్పుడూ 30 టీఎంసీల నీటిని అంబాటులో ఉంచాలని, అవసరానికి తగ్గట్టు, పరిస్థితులకు అనుగుణంగా వాడుకోవాలన్నారు. గోదావరి నుంచి నీరు వస్తే నేరుగా ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి తీసుకోవాలని, లేదంటే శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం ద్వారా తరలించాలన్నారు.

ఎస్ఆర్ఎస్పీ పరిధిలోని వరద కాలువ, కాకతీయ కాలువ మధ్య దాదాపు 139 చెరువులున్నాయని, వాటిలో నీరు అందని చెరువులను గుర్తించాలన్నారు. వరద కాలువకు వీలైనన్ని ఎక్కువ ఓటిలు పెట్టి ఆ చెరువులన్నింటినీ నింపే పని మూడు నాలుగు నెలల్లో పూర్తికావాలన్నారు. ఎస్ఆర్ఎస్పి, కాళేశ్వరం వల్ల వరద కాలువకు 365 రోజులూ సజీవంగా నీరు ఉంటుందన్నారు. వరద కాలువ ద్వారా ఇప్పటివరకు నీరందని ప్రాంతాలకు ఇవ్వాలన్నారు. ఈ పని ఆరు నెలల్లో పూర్తికావాలన్నారు. ఎల్లంపల్లి నుంచి నీటి లభ్యతకు మించి ఆయకట్టును ప్రతిపాదించినందున దాన్ని మార్చి 90వేల ఎకరాల లోపే ఆయకట్టుకు నీరందించి మిగతా ఆయకట్టుకు ఎస్ఆర్ఎస్పీ ద్వారా అందించాలని స్పష్టం చేశారు.

ఈ ఏడాది కృష్ణాలో నీటి లభ్యత పెరుగుతుంది
ఈ ఏడాది కృష్ణా నదిలో ఎక్కువ నీటి లభ్యత ఉండే అవకాశం ఉందని, ఇప్పటికే నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి వదిలారని తెలిపారు. వెంటనే జూరాల, భీమా-2 లిఫ్టుల ద్వారా నీటిని చెరువుల్లోకి తరలించడంతో పాటు రామల్పాడు రిజర్వాయర్ నింపాలన్నారు. కల్వకుర్తి లిఫ్టు ఇరిగేషన్ డి-82 డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులను వేగంగా పూర్తి చేసి, ఈ ఏడాదే 30 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలో నీటిని పెద్ద మొత్తంలో నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్ నిర్మించడమో లేక చెరువుల సామర్థ్యాన్ని పెంచడమో చేయాలన్నారు.

రాష్ట్రంలో సాగునీటి రంగం ఉజ్వలంగా మారి భారీ ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు వచ్చాయని, చెరువులు బాగుపడ్డాయని గుర్తుచేసిన కేసీఆర్ కోటికి పైగా ఎకరాలకు సాగునీరు అందించే గొప్ప వ్యవస్థ ఏర్పడిందన్నారు. నీటిని సమర్థవంతంగా నిర్వహించడం కూడా చాలా ముఖ్యమని, ఇందుకోసం ప్రతీ ప్రాజెక్టుకు నిర్వహణ ప్రణాళికను, ఆపరేషన్ రూల్స్‌ను సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. దీనికి అవసరమైన ఆర్థిక వనరులను ప్రభుత్వం బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తుందని తెలిపారు. సాగునీటి వ్యవస్థ సమర్థ నిర్వహణ కోసం నీటి పారుదల శాఖను పునర్విభజించి ఎక్కువ జోన్లను ఏర్పాటు చేసి, ప్రతీ జోన్‌కు ఒక చీఫ్ ఇంజనీర్‌ని బాధ్యుడిగా నియమించాలన్నారు. సిఇ పరిధిలోనే ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, చెరువులు ఉండాలన్నారు. మొత్తం నీటి పారుదలశాఖ ఒకే విభాగంగా పనిచేయాలని, నిర్దిష్టంగా ఆయా స్థాయిల్లో అధికారాలను అప్పగించాలన్నారు. ప్రతీ స్థాయి అధికారికి అత్యవసర పనులు చేయడం కోసం నిధులు మంజూరు చేసే అధికారాన్ని కూడా కల్పించాలన్నారు.

Advertisement

Next Story