- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మున్ముందు కరోనా కేసులు పెరుగుతయ్ : సీఎం కేసీఆర్
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా విషయంలో ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరంలేదని, ప్రజలు ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినా వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ‘కొన్ని అంచనాల ప్రకారం రాబోయే రెండు మూడు నెలల్లో దేశంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. తెలంగాణలో పాజిటివ్ కేసులు ఎక్కువైనా సరే, ఎంత మందికంటే అంతమందికి వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవసరమైన పీపీఈ కిట్లు, టెస్టు కిట్లు, మాస్కులు, బెడ్స్, వెంటిలేటర్లు, ఆసుపత్రులు అన్నీ సిద్ధంగా ఉన్నాయి’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వైద్యారోగ్య శాఖతో పాటు వివిధ శాఖల అధికారులతో ప్రగతి భవన్‌లో బుధవారం సమీక్ష నిర్వహించిన అనంతరం సీఎం ఈ విధంగా వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్ నిబంధనలు సడలించినా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఏమీ లేదని, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని కోరారు. కరోనా వైరస్ సోకినప్పటికీ చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని, అందువల్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం తెలిపారు. కొద్ది మందిలో మాత్రం లక్షణాలు కనిపిస్తున్నాయని, వారికి మంచి వైద్యం అందించాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు స్పష్టం చేశారు. సీరియస్‌గా ఉన్నవారి విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందించాలన్నారు. పాజిటివ్‌గా తేలినప్పటికీ లక్షణాలు లేనివారిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. ప్రజలు కూడా లాక్‌డౌన్ నిబంధనలను, కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలన్నారు.
సమీక్ష సందర్భంగా వైద్యశాఖ అధికారులు, వైద్య నిపుణులు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి, మంత్రులకు తాజా పరిస్థితిని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను బట్టి కరోనా విషయంలో అంతగా భయపడాల్సిన అవసరం లేదని సీఎంకు వివరించారు. అనేక అధ్యయనాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం వైరస్ సోకిన తర్వాత కూడా అత్యధిక శాతం మందిలో కనీసం వ్యాధి లక్షణాలు కూడా కనిపించడం లేదని పేర్కొన్నారు. వైరస్ సోకినవారిలో 80 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదని, వారికి ఎలాంటి వైద్యం కూడా అవసరం లేదని వివరించారు. కేవలం 15 శాతం మందిలో జలుబు, జ్వరం, దగ్గు, దమ్ము లాంటి ఐఎల్ఐ (ఇన్‌ఫ్లూయెంజా లాంటి) లక్షణాలు కనిపిస్తున్నాయని, ఇలాంటివారు త్వరగానే కోలుకుంటున్నట్టు తెలిపారు. మిగిలిన 5 శాతం మందిలో మాత్రమే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండే ‘సారి’ (సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్‌నెస్) లక్షణాలు కనిపిస్తున్నట్టు తెలిపారు. వీరి విషయంలోనే ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుందని, మరణించే వారు ఎక్కువగా వీరేనని వివరించారు. వీరిలో ఇతర జబ్బులు కూడా ఉంటున్నాయన్నారు.
లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వివిధ మార్గాల ద్వారా రాకపోకలు సాగిస్తున్నా వైరస్ వ్యాప్తిలో పెద్దగా ఆందోళన పడేంత పరిస్థితి లేదని సీఎంకు వివరించారు. ఇది మంచి పరిణామమని, కరోనాకు వ్యాక్సిన్, మందు లేనందున ప్రజలు అప్రమత్తంగా ఉండడం అవసరమని తెలిపారు. నిపుణులు, వైద్యుల సూచనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత సీఎం కేసీఆర్ పై విధంగా స్పష్టత ఇచ్చారు.