తప్పిస్తే ఏంటీ.. తప్పించకపోతే ఏంటీ..!

by Sridhar Babu |   ( Updated:2021-04-30 09:45:02.0  )
తప్పిస్తే ఏంటీ.. తప్పించకపోతే ఏంటీ..!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : మంత్రి ఈటల రాజేందర్ సీలింగ్ భూములు కొన్నాడన్న ఆరోపణల చర్చ తీవ్రంగా సాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిఘా వర్గాలను రంగంలోకి దింపింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఈటల ప్రభావం ఎంత అన్న విషయంపై సమగ్ర నివేదికలు తెప్పించుకుంటోంది. ఆయన సొంత జిల్లా అయిన కరీంనగర్ లో పరిస్థితి ఎలా ఉంటుంది, పార్టీకి నష్టం వాటిల్లుతుందా లేదా అన్న విషయాలపై ఇంటలిజెన్స్ ఎప్పటికప్పుడు నివేదికలు పంపుతున్నట్టు తెలుస్తోంది. అధినేత కేసీఆర్కు నేరుగా వెల్తున్న ఈ సమాచారంలో ఈటలను మంత్రి వర్గం నుండి తొలగిస్తే పార్టీ కేడర్ రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయా లేదా అన్న విషయంపై కూడా వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. అయితే ఈటల ప్రాతినిథ్యం వహిస్తున్న హుజురాబాద్ నుండి కొద్దో గొప్పో వ్యతిరేకత వస్తుందే తప్ప ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం ఆయనను తొలగిస్తే ఎలాంటి ప్ఱభావం చూపదని నిఘా వర్గాలు ముఖ్యమంత్రికి పంపించిన నివేదికలో చెప్పినట్టు సమాచారం.

టచ్‌లో ఉండే వారెవరూ..?

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఏ కేడర్ నాయకులు ఈటలతో టచ్ లో ఉంటున్నారు, గత కొంతకాలంగా వారితో ఈటల సాన్నిహిత్యంగా ఎంతమేర మెదులుతున్నారు అన్న వివరాలు కూడా అధినేతకు నిఘా అధికారులు పంపిస్తున్నారని సమాచారం. ఇటీవల కాలంలో పెద్దపల్లి జిల్లాలో తరుచూ పర్యటనలు చేసిన ఈటలకు ఆ నాయకునికి మధ్య ఉన్న లావాదేవీలు ఏంటీ, జగిత్యాల జిల్లాలో ఉన్న నాయకులు ఎవరెవరూ అన్న సమగ్రమైన వివరాలు ఇంటలీజెన్స్ సేకరిస్తున్నట్టు సమాచారం. అయితే అత్యంత సీక్రెట్ గా జరుగుతున్న ఈ ఆరా కేవలం స్థానిక అధికారులే కాకుండా హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా వచ్చిన బృందం కూడా తెలుసుకుంటున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రంలోని పాత 10 జిల్లాల వారిగా గంటగంటకు సమాచారం అధినేత టేబుల్ మీదకు చేరుతున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story