24 గంటలు కర్ఫ్యూ పాటిద్దాం : కేసీఆర్

by sudharani |
24 గంటలు కర్ఫ్యూ పాటిద్దాం : కేసీఆర్
X

దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని, అయితే కేంద్రం సూచించిన విధంగా 12గంటలు కాకుండా మన కోసం.. మన సమాజం కోసం.. మన ప్రపంచం కోసం 24గంటలు కర్ఫ్యూ పాటించి దేశానికే ఆదర్శంగా నిలవాలన్నారు. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకూ కర్ఫ్యూలో పాల్గొనాలని తెలిపారు. ఎంత ఎక్కువ పాటిస్తే అంత క్షేమంగా ఉంటామని తెలిపారు. శనివారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ వైరస్ నివారణకు ప్రతిఒక్కరూ ముందడుగు వేయాలని.. పదేండ్ల లోపు పిల్లలు, 60ఏండ్లు దాటిన వ‌ృద్ధులు ఎవరూ బయటకు రావొద్దని సూచించారు. ఇప్పటికి రాష్ర్టంలో 21మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, వీళ్లంగా విదేశాల నుంచి వచ్చిన వాళ్లే అని తెలిపారు. మన దగ్గర వాళ్లకి ఇంకా ఎవరికీ రాలేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కరోనా నివారణకు రాష్ర్టంలో అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వారు ఎవరో తెలియడం లేదని, ఇప్పటికే రాష్ర్టవ్యాప్తంగా 52 అంతర్రాష్ర్ట చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. దాదాపు 78 టీమ్‌లు హైవేలపై ఇన్‌స్పెక్షన్ చేస్తున్నాయని తెలిపారు. ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయనీ, విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడానికి 5274 నిఘా బృందాలు కూడా పనిచేస్తున్నాయనీ అన్నారు. రాష్ర్టంలోకి 25వేల మంది విదేశాల నుంచి వచ్చారని, అందులో 11వేల మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిన్నఒక్కరోజే 1500మంది వచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఐదుగురు నిపుణులతో రాష్ర్టంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని, పరిస్థితిని ఎప్పటికప్పుడూ ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారు సమాజహితం కోరాలని, స్వచ్చందంగా వివరాలు చెబితే వైద్యం అందిస్తామని సూచించారు. చెబితేనే మీ కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయని అన్నారు. చెప్పకపోయిన నిఘా బృందాల నుంచి ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. చికిత్స ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను అందరూ వినియోగించుకోవాలని అని తెలిపారు. స్వచ్చందంగా చెప్పడం సామాజిక బాధ్యత అని అన్నారు. ‘చేతులెత్తి మొక్కుతున్నా.. సహకరించండి అని’ విదేశాల నుంచి వచ్చిన వాళ్లను సీఎం కేసీఆర్ వేడుకున్నారు. రాష్ర్టంలో జబ్బుకు విదేశీ ప్రయాణాలే అని అన్నారు. జ్వరం, జలుబు, దగ్గు ఉన్నవారు తక్షణమే సమాచారం ఇవ్వాలన్నారు. సీసీఎమ్‌బీలో ల్యాచ్ పరీక్షలకు అనుమతి కావాలని ప్రధానిని కోరానని తెలిపారు. ప్రధాని దానికి సానుకూలంగా స్పందించారని, సీసీఎమ్‌బీలో ఒకేసారి వెయ్యి శాంపిల్స్‌కు పరీక్షలు చేయొచ్చు అన్నారు. ఆదివారం దాదాపు అన్ని సేవలు బంద్ చేస్తున్నామని ఎమర్జెన్సీ కోసం డిపోకి 5బస్సులు అందుబాటులో ఉంచామన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే బస్సులకు రేపు రాష్ర్టంలోకి నో ఎంట్రీ అన్నారు. మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు, దుకాణాలు అన్ని సేవలూ బంద్ చేస్తున్నామని, ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉంటాయన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఎంతో ప్రమాదం ఉందని, పక్కనే ఉన్న మహారాష్ర్టలో పరిస్థితి సీరియస్‌గా ఉందన్నారు. మహారాష్ర్టంలో పరిస్థతి ఆధారంగా బోర్డర్లూ బంద్ చేస్తున్నామన్నారు. ముఖ్యంగా పిల్లలు పెద్దలు రెండువారాలు ఇంట్లోనుంచి బయటకు రాకపోవడమే మంచిదని అన్నారు.

tags : CM KCR, Press Meet, pragathi bhavan, coronavirus, Janata curfew, Statewide preventive measures

Advertisement

Next Story