కాళ్ళు, చేతులు కడుక్కొని ఇంట్లోకి రండి

by Shamantha N |
కాళ్ళు, చేతులు కడుక్కొని ఇంట్లోకి రండి
X

దిశ, న్యూస్ బ్యూరో:
కరోనా వ్యాప్తి నిరోధకంపై కఠిన చర్యలు తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఇంటికి వచ్చేవారికి కూడా ఆంక్షలు విధించారు. యావత్తు తెలంగాణ సమాజ సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రజలంతా పాటించాల్సిన కనీస శుభ్రతాచర్యలను తన ఇంటి నుంచే మొదలుపెట్టారు. మంత్రుల మొదలు అధికారుల వరకు ప్రతి ఒక్కరూ దీన్ని పాటించేలా నిబంధన విధించారు. ప్రగతి భవన్‌కు తనను కలవడానికి వస్తున్న, సమీక్షా సమావేశానికి హాజరవుతున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల వరకు వ్యక్తిగత శుభ్రత ప్రాధాన్యతను గుర్తించాలని కోరారు. అందులో భాగమే ప్రగతిభవన్ సమావేశ మందిరం లోపలికి వెళ్ళే ముందు విధిగా వారు కాళ్ళు, చేతులు కడుక్కోవాలనే నిబంధన.

దీనికి ‘హ్యాండ్ వాష్’ అని పేరు పెట్టి చేతులు కడుక్కోవడానికి ప్రత్యేకంగా రెండు పెద్ద గంగాళాల్లో నీళ్లు నింపి పెట్టారు. మంత్రులు, సీనియర్ అధికారులెవరైనా, వారి స్థాయి ఎలాంటిదైనా తప్పనిసరిగా కార్యాలయంలోకి ప్రవేశించే ముందు అక్కడ చేతులు కడుక్కోవాల్సిందే. ఆ తర్వాత శానిటైజర్‌తో చేతుల్ని శుభ్ర పరుచుకోవాల్సిందే. గడచిన రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ‘లాక్‌డౌన్’ పరిస్థితిపై మంగళవారం మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో అత్యవసర, అత్యున్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి హాజరైన మంత్రులు, ఇతర అధికారులు బయటే నీళ్ళు, సబ్బుతో చేతులు కడుక్కొని లోపలికి ప్రవేశించారు. ప్రతి ఇంట్లో, ప్రతి కార్యాలయంలో కూడా ఇలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.

ప్రగతిభవన్ నుంచి మొదలైన ఈ ప్రాధాన్యతాకార్యక్రమాన్ని రాష్ట్రంలోని ప్రతీఇల్లు పాటించాలనే సందేశాన్ని ఆచరణ రూపంలోనే ప్రజలకు చేరవేయడానికి దోహదపడింది. ప్రజలకు చెప్పడమే కాకుండా దాన్ని ఆచరిస్తున్నందున ఇకపైన రాష్ట్రమంతటా ఇది అమలవుతుందనే విశ్వాసం వివిధ స్థాయిల్లో ఏర్పడుతోంది. గతంలో మన ఇంటికి ఎవరైనా బంధువులు లేదా స్నేహితులు వస్తే వాకిలి దాటి లోపలికి రాగానే ఇంట్లోకి వెళ్ళే ముందు చెంబుతో నీళ్ళు ఇచ్చి కాళ్ళు, చేతులు, ముఖం శుభ్రం చేసుకునే సంప్రదాయం అమలయ్యేది. ఇటీవలి కాలంలో మారిన సంస్కృతి, పట్టణీకరణలో భాగంగా ఈ సంప్రదాయం గ్రామాలకు మాత్రమే పరిమితమైంది. కానీ, ఇప్పుడు కరోనా పుణ్యమా అని సమాజంలో స్థాయితో సంబంధం లేకుండా మళ్ళీ ఆ సంప్రదాయం అనివార్యమైంది. థ్యాంక్యూ కరోనా!

Tags: Telangana, CM, CM KCR, Pragathi Bhavan, Review Meeting, Corona

Advertisement

Next Story

Most Viewed