సీఎం కేసీఆర్​, కిషన్​రెడ్డి డ్రామా ఇది : రేవంత్

by Shyam |
సీఎం కేసీఆర్​, కిషన్​రెడ్డి డ్రామా ఇది : రేవంత్
X

దిశ, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో వరదసాయం పంపిణీపై సీఎం కేసీఆర్​, కేంద్రమంత్రి కిషన్​రెడ్డి కలిసి డ్రామా ఆడుతున్నారని కాంగ్రెస్​ ఎంపీ రేవంత్​రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రేటర్​లో రూ.250 కోట్ల వరద సాయం నిధులు టిఆర్ఎస్ నేతల జేబుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. మహిళలు రోడ్లెక్కి ఎదురు తిరగడంతో మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారని, దాంతో పెద్ద సంఖ్యలో ప్రజలు మీ సేవ వద్దకు బారులు కట్టారన్నారు. అకౌంట్లలో డబ్బులు వేస్తే టీఆర్ఎస్ నేతలకు కమీషన్లు, ఓట్లు రావనే అనుమానంతోనే ఎన్నికల అధికారులకు సహాయాన్ని నిలిపేయాలని ఆదేశాలిచ్చారని విమర్శించారు. ఎన్నికల సంఘం అదేశించిందన్న సాకుతో వరద సహాయం నిలిపేయడం దుర్మార్గమని మండిపడ్డారు.

జాతీయ విపత్తును పర్యవేక్షించే బాధ్యత కేంద్ర హోంమంత్రిగా కిషన్ రెడ్డికి ఉందని, కేంద్ర ప్రత్యేక అధికారులను పంపించి సహాయం అందించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతుబంధు వేసినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు వస్తుందని, వెంటనే వరద సహాయాన్ని అర్హులందరికీ అందించాలని డిమాండ్​ చేశారు. మీ సేవ వద్ద లైన్‌లో నిల్చుని మృతి చెందిన మహిళకు రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని రేవంత్​రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Next Story

Most Viewed