కరోనాపై సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం

by sudharani |
కరోనాపై సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం
X

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై.. చర్చించేందుకు గురువారం అత్యవసర, అత్యున్నత రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రేపు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్‎లో జరిగే ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలను ఆహ్వానించారు. అటు మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మహమూద్ అలీ, శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లా రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లను ఈ సమావేశానికి ఆహ్వానించారు.

ఇండోనేషియా నుంచి కరీంనగర్‎కు వచ్చిన కొంతమంది విదేశీయులకు కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలియడంతో రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తంగా వుండాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తలెత్తిన పరిస్థితిని, తీసుకోవాల్సిన జాగ్రత్తలను, పాటించాల్సిన నియంత్రణ పద్ధతులను గురువారం నాటి సమావేశంలో చర్చించనున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున ఎట్టి పరిస్థితుల్లోను విదేశాల నుంచి వచ్చిన వారు సంపూర్ణ వైద్య పరీక్షలు చేసుకోవాలని కోరారు. ఈ విషయంలో ప్రజలు కూడా అప్రమత్తమై ప్రభుత్వానికి సమాచారమందించాలని, స్వీయ ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

విదేశాల నుంచి వచ్చిన ఎవరినైనా సరే సంపూర్ణ పరీక్షలు జరిపిన తరువాతనే ఇండ్లకు పంపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వుండేందుకు ప్రభుత్వం ఇప్పటికే కొన్ని అంశాల్లో 15రోజుల కార్యాచరణ, మరికొన్ని అంశాల్లో వారం రోజుల కార్యాచరణ ప్రకటించి అమలు చేస్తున్నది. గురువారం జరిగే అత్యవసర, అత్యున్నత సమావేశంలో మరిన్ని నియంత్రణ చర్యలు తీసుకునే అవకాశం వుంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రజలు ఎక్కువగా గుమిగూడే కార్యక్రమాలన్నింటినీ రద్దు చేయాలని నిర్ణయించింది. సామూహికంగా జరిగే పండుగలు, ఉత్సవాలకు కూడా దూరంగా వుండాలని ప్రజలకు ముఖ్యమంత్రి కేసిఆర్ పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలను ప్రజలు అర్థం చేసుకుని రాష్ట్రాన్ని కాపాడుకోవాలని, జనం ఒకే చోట గుమిగూడవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచిస్తున్నారు.

tag: CM KCR, corona effect, Emergency, highest state level conference, thursday, pragathi bhavan

Advertisement

Next Story

Most Viewed