- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ నేడు ఢిల్లీలో కీలక భేటీ
దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఆయన వెంట మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సోమవారం మధ్యాహ్నం కృషి భవన్‌లో రాష్ట్ర మంత్రులు, అధికారులు భేటీ కానున్నారు. రానున్న యాసంగి సీజన్‌కు తెలంగాణలో పండే వడ్లలో ఎంత మేరకు కొనుగోలు చేయనున్నదనే అంశంపై చర్చలు జరపనున్నారు. భారత ఆహార సంస్థ దగ్గర ఇప్పటికే పరిమితికి మించి నిల్వలు ఉన్నందున యాసంగి సీజన్‌లో కొనడంపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో నిర్దిష్టంగా సేకరించే క్వాంటిటీకి అనుగుణంగా రాష్ట్రంలో రైతులను ప్రత్యామ్నాయ పంటవైపు మళ్ళించడంపై రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్చల తర్వాత నిర్ణయం తీసుకోనున్నది.
ఈ చర్చల్లో రాష్ట్ర మంత్రులతో పాటు ప్రధాన కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ కమిషనర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి తదితరులు కూడా పాల్గొంటారు. రెండు నెలల క్రితం భేటీ సందర్భంగా ఎఫ్‌సీఐ నుంచి స్పష్టమైన సమాచారమే వచ్చినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో తగిన మార్పులు చేయాలని తాజా భేటీ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్నది. దీనికి తోడు గత యాసంగి సీజన్‌లో ఎఫ్‌సీఐ సేకరించిన ధాన్యాన్ని ఇంకా రవాణా చేయకుండా రాష్ట్రంలోని గోడౌన్లలోనే ఉంచడంతో ప్రస్తుతం చేతికొచ్చిన పంటను నిల్వ చేసుకోవడంలో ఉన్న ఇబ్బందులను కూడా కేంద్ర మంత్రికి వివరించనున్నారు. వెంటనే గతేడాది యాసంగిలో రాష్ట్రం నుంచి ఇంకా సేకరించాల్సి ఉన్న దాదాపు ఐదు లక్షల టన్నులను కూడా వెంటనే తీసుకోవాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయనున్నారు.
ట్రిబ్యునల్ ఏర్పాటుపై వత్తిడి
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన కనీసంగా నాలుగైదు రోజులు ఉండే అవకాశం ఉన్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసి కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను తేల్చాలని, ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేయనున్నారు. ఇప్పటికే ఏడేండ్లు దాటిందని, ఎలాంటి పురోగతి లేనందువల్ల కేంద్రం తాత్సారం చేయకుండా వెంటనే స్పందించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని ఇప్పటికే కేసీఆర్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గెజిట్ అమలుపైనా ఈ భేటీ సందర్భంగా కేసీఆర్ కేంద్ర మంత్రితో చర్చించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై ఇప్పటికే పలుమార్లు ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకున్నారు. రెండు రాష్ట్రాల సాగునీటి అధికారులు భేటీ అయ్యారు.
ప్రధానితో భేటీ
రాష్ట్రానికి సంబంధించిన అనేక పెండింగ్ అంశాల చిట్టాను, డిమాండ్లను ప్రధాని మోడీకి వివరించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆయన అపాయింట్‌మెంట్ కోసం పీఎంఓ అధికారులతో రాష్ట్ర ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రధానితో భేటీ సందర్భంగా రాష్ట్ర విభజన చట్టంలోని పలు అంశాలను ప్రస్తావించనున్నారు. గత భేటీ సందర్భంగా ప్రస్తావించిన పదకొండు అంశాలతో పాటు వడ్ల కొనుగోళ్ళు, జల వివాదాలు, విభజన చట్టంలో అమలుకు నోచుకోని అంశాలు తదితరాలను ప్రస్తావించనున్నారు. వీటన్నింటికీ మించి సాగు చట్టాలను రద్దు చేసినందున రైతులకు ప్రయోజనకరంగా ఉండే కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) చట్టాన్ని తీసుకురావాల్సిందిగా కోరనున్నారు. కొత్తగా తేవాలనుకుంటున్న విద్యుత్ చట్టం ఆలోచనను విరమించుకోవాల్సిందిగా సూచించనున్నారు.