సీఎం హామీలు ఏటుపాయే..!

by Shyam |
సీఎం హామీలు ఏటుపాయే..!
X

‘‘తహసీల్ విధానానికి సంబంధించి తెలంగాణ మోడల్ రాష్ట్రం కావాలి. గుంట భూమికి కూడా కిరికిరి లేకుండా చేస్తా. అవసరమైతే రూ. రెండు వేల కోట్లయినా ఖర్చు చేస్తా. సమగ్ర భూ సర్వే చేయిస్తా. భూమి పంచాయితీలే లేకుండా చేస్తా. నాతో సహా సీఎస్, అధికారులంత వస్తరు. ప్రజాదర్బార్ పెడతం. ప్రతి జిల్లాలో రెండు రోజులు ఉంటం పూర్తి యాజమాన్యపు హక్కులతో ‘కన్ క్లూజివ్’ టైటిల్ ఇస్తం. భూముల వివరాలు కంప్యూటర్లనే ఉంటయ్. వివరాలు తప్పని తేలితే ప్రభుత్వమే జుర్మానా కడతది. దీని ప్రకారం రెవెన్యూ యాక్ట్ మారుస్తం. భూ సమస్యలను పరిష్క రించేందుకు జిల్లాకో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం’’
– గత ఎన్నికల ప్రచారం సందర్భంగా మానుకోట, ఖమ్మం సభలలో సీఎం కేసీఆర్

దిశ, న్యూస్‌బ్యూరో: కొత్త రెవెన్యూ చట్టం బుధవారం అసెంబ్లీకి రానుంది. భూ సమగ్ర సర్వే, జిల్లాకో ట్రిబ్యునల్, కన్ క్లూజివ్ టైటిల్ వంటి వాటికి అందులో చోటు ఉంటుందా? సీఎం కేసీఆర్ ఆలోచనలను అమలు చేస్తారా? లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కొత్త చట్టం రూపకల్పనలో సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఎందరో నిపుణులు రెండేండ్లుగా కష్టపడ్డారు. నిన్న మొన్న జరిగిన భేటీలో ఇవేమీ చర్చకు రాలేదని సమాచారం. సీఎం ఆలోచనల సమాహారంగా చట్టం రూపొందితే రాష్ట్రానికి, ప్రజలకు అత్యంత ప్రయోజనకారిగా ఉంటుంది. అధికారులే అందుకు బ్రేకులు వేసినట్లు విశ్వ సనీయ సమాచారం. భూ సంబంధిత అంశాలకు సంబంధించి సీఎం ఇచ్చిన హామీలను అధికారులతోనూ ప్రస్తావించారు. వారెవరూ వీటిని రూపొందించేందుకు ససేమిరా అన్నట్లుగా తెలిసింది. కన్ క్లూజివ్ టైటిల్ ఇస్తే, రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారుడిగా నమోదైతే, సదరు భూమిపై సర్వహక్కులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. దీనిని అమలు చేస్తే ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయంటూ దాటవేత ధోరణిని అవలంబించారని చెబుతున్నారు. ఆధునిక టెక్నాలజీని వినియోగించుకొని భూముల సర్వే చేపట్టేందుకు కూడా సర్కారు సిద్ధంగా లేదని స్పష్టమవుతోంది.

మేనిఫెస్టోలో పెట్టారు..

తెలంగాణ ఏర్పాటు తర్వాత భూ సమగ్ర సర్వే చేపట్టనున్నట్లు టీఆర్ఎస్ మేనిఫెస్టోలోనూ ప్రకటించారు. మొదటి రెండేండ్లు దాని కోసం బడ్జెట్ ను కూడా కేటాయించారు. బ్యూరోక్రాట్ల అడ్డగింతల వల్లనే అది ముందుకు సాగలేదని తెలుస్తోంది. తాజాగా రూపొందించిన తెలంగాణ చట్టంలోనూ ఈ అంశాలకు చోటు లేదని రెవెన్యూ చట్టాల రంగ నిపుణుడొకరు ‘దిశ’కు వివరించారు. అప్పటి మానుకోట, ఖమ్మం సభల్లో ప్రజలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యతలను విస్మరిస్తున్నారన్నారు. అధికారులు, సిబ్బంది పేర్ల మార్పిడి, అధికారాల బదలాయింపు వల్ల ప్రజలకు, సామాన్యులకు ఒరిగేదేం లేదు. ఏ పనైనా ఎవరో ఒకరు చేయాల్సిందే. అలాంటప్పుడు ఏ స్థాయి అధికారి చేతుల్లో ఉంటే మాత్రం సామాన్యులకు చేకూరే ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. కాగితానికి విలువ పెంచాలి. రెవెన్యూ కోడ్, టైటిల్ గ్యారంటీ, కన్ క్లూజివ్ టైటిల్ వంటివి అమలు కావాలని ఆయన పేర్కొన్నారు.

అదెలా సాధ్యం?

కొత్త రెవెన్యూ చట్టంలో ఆర్వోఆర్ మార్పులు మినహా మరే ఇతర అంశాలకు ప్రాధాన్యం కల్పించలేదని అంటున్నారు. ఆటోమెటిక్ మ్యూటేషన్ చేసేందుకు వ్యవస్థను రూపొందించనున్నట్లు సమాచారం. ల్యాండ్ కోర్ బ్యాంక్ ద్వారా ఎవరైనా అమ్మినా, కొన్నా వెంటనే మ్యూటేషన్ జరిగేటట్లు ఆన్లైన్ వ్యవస్థను అమలు చేయనున్నారు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్లో వీఆర్వో, ఆర్ఐ, తహసీల్దార్, ఆర్డీఓలకు ఎలాంటి బాధ్యతలు ఉండవు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాగానే ధరణి వెబ్ సైట్ కు వచ్చేస్తుంది. ఆ తర్వాత చేర్పులు, మార్పులు జరుగుతాయి. 100 శాతం రికార్డులు సక్రమంగా ఆన్లైన్ లో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ప్రతి ఊరిలోనూ 10 నుంచి 20 శాతం వరకు వివాదాలు ఉన్నాయి. వాటిని పరిష్కరించకుండా ఈ విధానం అమలు కష్టమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Next Story