సారు కనికరించలే.. నర్సుల బాధలు తీరలే..

by Anukaran |
nurses
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా సమయంలో నర్సుల విలువెంతో ప్రభుత్వాలకు తెలిసొచ్చింది. డాక్టర్లు కరోనా ఐసొలేషన్ వార్డులకు మొక్కుబడి విజిట్‌లు చేసినా నర్సులు మాత్రం 24 గంటలూ పేషెంట్లకు సేవలందించారు. చికిత్స చేశారు. వారు కోలుకునేదాకా కంటికి రెప్పలా కాపాడుకున్నారు. నర్సింగ్ రంగ సంక్షేమం గురించిగానీ, నర్సుల ఉద్యోగ భద్రత గురించిగానీ ఏ ప్రభుత్వాలూ పట్టించుకోలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నర్సింగ్ రంగం కూడా మెరుగుపడుతుందని నర్సులు భావించినా, వారి ఆశ అడియాసే అయింది. అందుకే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార పార్టీకి వ్యతిరేకంగా నర్సులంతా ఒక్కటవుతున్నారు. సొంతంగా అభ్యర్థిని నిలబెట్టారు. ఐక్యతను అధికార పార్టీకి తెలియజేయాలనుకుంటున్నారు. గడచిన ఆరున్నరేళ్లలో ప్రభుత్వ రంగంలో ఒక్క నర్సింగ్ స్కూలు, కాలేజీ కొత్తగా ఏర్పాటు కాలేదు. ప్రైవేటులోనూ మూడు కాలేజీలకు మాత్రమే అనుమతి లభించింది. అవి కూడా అధికార పార్టీకి చెందినవారివే. దాదాపు 30కు పైగా నర్సింగ్ కళాశాలల కోసం దరఖాస్తులు వచ్చినా, అందులో ఎనిమిది మాత్రమే అర్హత సాధించాయి. హై లెవల్ కమిటీ సిఫారసు చేసినా ప్రభుత్వం అనుమతి మంజూరు చేయలేదు. కొన్ని కళాశాలలు కోర్టును కూడా ఆశ్రయించాయి.

అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినా..

నర్సింగ్ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అది అతీగతి లేకుండా పోయింది. ఇప్పటికీ నర్సింగ్ డైరెక్టరేట్‌కు పూర్తిస్థాయి అధికారి లేరు. డీఎంఈ (వైద్య విద్య డైరెక్టర్) ఇన్‌చార్జి పాలనే కొనసాగుతోంది. డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు కూడా లేవు. నర్సింగ్ విభాగానికి చెందినవారికే డిప్యూటీ డైరెక్టర్ బాధ్యతలు చూడాల్సి ఉన్నా అదనపు చార్జీలతో గ్రూప్-వన్ అధికారి నిర్వహిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో నర్సులకు తీవ్ర కొరత ఉంది. చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న నర్సులు కరోనా భయంతో గ్రామాలకు వెళ్లిపోయారు. ప్రైవేటులోని నర్సులలో దాదాపు సగం కేరళ, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారే. తిరిగి రాలేదు. కార్పొరేట్ ఆసుపత్రులు డబుల్ జీతం ఇస్తామన్నా స్కిల్ ఉన్న నర్సులు దొరకడంలేదు. కాంట్రాక్టు విధానమే ఉండదని కేసీఆర్ చెప్పినా ఆచరణలో అమలుకావడంలేదు. నర్సింగ్ కౌన్సిల్‌కు ఇప్పటివరకూ తెలంగాణలో ఎన్నికలే జరగలేదు. స్టాఫ్ నర్సుల నియామకంలోనూ నిర్లక్ష్యం కొనసాగుతోంది. 2017లో 3,311 నర్సు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. ఇప్పటికీ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తికాలేదు. ప్రభుత్వ ఆసుపత్రులలో బెడ్‌ల సంఖ్య పెరిగినా, డాక్టర్ల సంఖ్య పెరిగినా నర్సుల సంఖ్య మాత్రం అంతే ఉండిపోయింది. నర్సులపై పనిభారం కూడా పెరిగింది. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు జరుగుతున్నా అరకొర జీతాలు, సకాలంలో రాని వేతనాలతో బాధలనుభవిస్తున్నారు.

అర్హత సాధించలేక..

3311 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాతపరీక్షలు నిర్వహిస్తే 22 వేల మందికి పైగా హాజరయ్యారు. ఇందులో 3142 మంది మాత్రమే అర్హత సాధించారు. నాణ్యమైన బోధన లభించకపోవడంతో అర్హులు కాలేకపోతున్నారు. ప్రభుత్వ నర్సింగ్ విద్యా సంస్థల్లో బోధనా సిబ్బంది లేకపోవడం, ప్రిన్సిపాళ్లు ఇన్చార్జీలు ఉండడం, బోధనా సిబ్బంది పోస్టుల భర్తీ జరగకపోవడంలాంటి కారణాలతో ప్రమాణాలు పడకేశాయి. ఇందుకు నిరసనగానే నర్సులంతా ఏకమయ్యారు. వారి తరపున ప్రొఫెసర్ రాజేశ్వరిని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్సీ (పట్టభద్రుల) నియోజకవర్గంలో పోటీకి నిలిపారు. రాజేశ్వరిని గెలిపించుకుంటామని బహిరంగంగానే ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో దాదాపు 40 వేల మంది నర్సులు ఓటర్లుగా ఉన్నారు. వీరికి వైద్యరంగంలోని పలువురు గ్రాడ్యుయేట్లు కూడా మద్దతు ఇస్తున్నారు. గతంలో ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోడానికి పెద్దగా ఆసక్తి చూపని నర్సులు ఈసారి మాత్రం ఉత్సాహంగా ఓటర్ల జాబితాలో చేరారు.

కేసీఆర్ కుటుంబానికి అనుబంధం

తెలంగాణ ఉద్యమం సమయంలో 2009 నవంబరులో దీక్ష సందర్భంగా ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో చేరిన కేసీఆర్‌కు వైద్య సేవలందించిన నర్సు మేరి సూర్యపోగు. ఇప్పటికీ ఆమె ఆ ఆసుపత్రిలోనే పని చేస్తున్నారు. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా భవిష్యత్తులో నర్సుగా వృత్తిలో స్థిరపడాలనే కోరిక ఉండేదని 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆ ఏడాది జనవరి 30న ట్విట్టర్‌ వేదికగా ‘ఆస్క్ కవిత’ కార్యక్రమంలో ఒక నెటిజెన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా నర్సు కావాలనే కోరిక ఉండేదని పేర్కొన్నారు. నగరంలోని చెస్ట్ ఆసుపత్రిలో సీనియర్ నర్సు జయమణి చనిపోయినా ప్రభుత్వం తరఫున ఎవ్వరూ కుటుంబాన్ని పరామర్శించలేదు. భద్రాచలంలో కరోనా కారణంగా డాక్టర్ చనిపోయినప్పుడు ప్రభుత్వ ప్రతినిధి వెళ్ళి పరామర్శించిన విషయాన్ని నర్సులు ప్రస్తావిస్తున్నారు. పెంపుడు తల్లి బాధలనుభవించలేక ఇబ్బంది పడిన ప్రత్యూషను సీఎం హోదాలో కేసీఆర్ 2015లో దత్తత తీసుకున్నారు. ఆమెను నర్సింగ్ కోర్సులో చేర్పించి చదివించారు. పెళ్ళి కూడా చేశారు. కేసీఆర్ నర్సింగ్ రంగం గురించి మాత్రం పట్టించుకోలేదని అంటున్నారు.

Advertisement

Next Story