వీరిపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం

by Anukaran |   ( Updated:2020-12-04 21:54:43.0  )
వీరిపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ ఎన్నికల దెబ్బ ప్రగతి భవన్‌ను తాకింది. ఊహించని ఫలితాలు గులాబీ బాస్‎ను దీర్ఘాలోచనలో పడేశాయి. ఎక్కడ బెడిసికొట్టిందనే పోస్టుమార్టం మొదలైంది. ఒకవైపు ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే ట్రెండ్స్ చూసి ఇన్‌చార్జిలుగా వ్యవహరించిన మంత్రులతో ఫోన్‌లోనే మాట్లాడారు. ఎంతో నమ్మకంతో బాధ్యతలు అప్పజెప్తే ఫలితాలు అందుకు భిన్నంగా ఎందుకొచ్చాయంటూ వారిని నిలదీసినట్లు సమాచారం. నట్టేటా మునిగే ఫలితాలకు కారణమేంటో ఆరాతీశారు. డివిజన్ అభ్యర్థులను సైతం గెలిపించుకోలేకపోవడంపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

కనీసం ఎక్స్ అఫిషియో సభ్యులను కలుపుకున్నా మేయర్‌ను గెలిపించుకోలేకపోతున్నామన్న ఆవేదనను, ఆగ్రహాన్ని ప్రదర్శించినట్లు తెలిసింది. మజ్లిస్ లాంటి పార్టీల మద్దతు లేకండా మేయర్ సీటు కష్టమేనన్న నిరుత్సాహంతో ఘాటుగానే వారిని మందలించినట్లు తెలిసింది. వంద చోట్ల గెలుపు ఖాయం అని టార్గెట్ ఫిక్స్ చేసుకున్న మంత్రి కేటీఆర్‌నూ గట్టిగానే ప్రశ్నించినట్లు సమాచారం. మొత్తం మంత్రులందరినీ, జిల్లాల్లోని ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్ రప్పించి బాధ్యతలు అప్పజెప్పి ఇక్కడే పది రోజుల 0పాటు మకాం వేసి పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షించినా ప్రతికూల ఫలితాలు ఎందుకొచ్చాయంటూ నిలదీశారని తెలిసింది.

ఉద్యోగులు, పేదల నుంచి లభించని మద్దతు.?

గ్రేటర్లో సెంచరీ ఖాయం.. తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తాం.. మేయర్ స్థానం కోసం ఎవ్వరి సపోర్టూ అవసరం లేదు అంటూ రకరకాల ప్రగల్భాలు పలికినా నగర ఓటర్లు ఇచ్చిన తీర్పు ఆ పార్టీకి నిరాశే మిగిల్చింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు, వరద సాయం అందుకున్నవారి ఓట్లు కూడా పడలేదా అనే సందేహంపైనే ప్రగతి భవన్‌లో సీనియర్ నేతలతో సీఎం చర్చిస్తున్నట్లు తెలిసింది. మజ్లిస్‌తో పొత్తు లేదని చెప్పుకుంటున్న సమయంలో మేయర్ సీటు కోసం అనివార్యంగా మద్దతు కోరాల్సి వస్తోందని, ఇప్పుడు ఏం చేయాలనే దానిపైనే లోతుగా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.

వరద సాయంగా పది వేల రూపాయలను ఇచ్చినా ఎందుకు ఆశించిన ఫలితం రాలేదన్న దానిపై లోతుగానే చర్చ జరిగిందని పార్టీ నేత ఒకరు వివరించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల అంశం కూడా బాగా దెబ్బకొట్టిందనే అభిప్రాయాన్ని కూడా కొద్దిమంది సీఎంకు వివరించినట్లు తెలిసింది. అయితే వారి అభిప్రాయాలతో ఏకీభవించని సీఎం పరిస్థితిని అనుకూలంగా మల్చుకోవడంలో ఇన్‌చార్జిలంతా విఫలమయ్యారని సూటిగానే చెప్పినట్లు తెలిసింది. మజ్లిస్‌తో పొత్తే లేదు అని ఎంత చెప్పినా నగర ఓటర్లలో నమ్మకం కలగలేదని, బీజేపీ ప్రచారం చేసుకున్న సర్జికల్ స్ట్రైక్, హిందు మతం అంశాలే ప్రజల మైండ్‌సెట్‌ను మార్చాయన్న అభిప్రాయాన్ని సీనియర్ నేతలు కేసీఆర్‌కు వివరించినట్లు తెలిసింది. కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకం అయినా బీజేపీ నుంచి కొత్త తలనొప్పి, ప్రమాదం ముంచుకొచ్చిందన్న అభిప్రాయం ఇప్పుడు పార్టీ శ్రేణులను కలవరానికి గురిచేస్తోంది.

ఆలోచనలో పడ్డ గులాబీ బాస్..

జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆసక్తికరంగా, ఉత్కంఠ రేకెత్తించే విధంగా జరగడంతో ఓట్ల లెక్కింపు వివరాలను ఉదయం నుంచే ప్రగతి భవన్‌లో ఉండి విశ్లేషించుకుంటున్నారని సీనియర్ నేతలు తెలిపారు. మధ్యాహ్నం తర్వాత నుంచి పరిణామాలను అంచనా వేస్తూ పక్కనే ఉన్న సీనియర్ నేతలతో చర్చిస్తూనే ఓటర్ల ఆలోచనల్లో వచ్చిన మార్పు, వారి మనసును గెల్చుకోవడంలో జరిగిన లోపాలు తదితరాలపై సీఎం చర్చించినట్లు సమాచారం. దుబ్బాక ఫలితాలే పార్టీ శ్రేణులను ఆందోళనలో పడేయగా ఇప్పుడు జీహెచ్ఎంసీ ఫలితాలు మరింత గందరగోళాన్ని సృష్టించాయన్న అభిప్రాయంతో ఉన్నట్లు తెలిసింది. పార్టీలో వివిధ స్థాయిల్లో ఉన్న నేతలు త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్న సమయంలో జీహెచ్ఎంసీ ఫలితాలు వారి ఆలోచనలపై ఎలాంటి ప్రభావం వేస్తాయో, వారి ప్రయత్నాలను మరింత వేగంగా జరిగేందుకు దోహదపడతాయేమోననే ఆందోళనతో ఉన్నట్లు తెలిసింది.

పార్టీలో అసలేం జరుగుతోంది, ఇంతగా పార్టీ దిగజారిపోయే పరిణామాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి అంటూ పలువురు మంత్రులతో సీఎం ఆరా తీసినట్లు తెలిసింది. గ్రేటర్ ఎన్నికలకు ప్రతిపక్షాలు సిద్ధం కావడానికి సమయం ఇవ్వకుండా ముందుగానే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నా.. చివరకు ఆశించిన ఫలితాలు రాకుండా ప్రతిపక్ష పార్టీకే ఎక్కువ మేలు జరగడానికి కారణాలపై లోతుగా సమీక్ష మొదలైంది.

గ్రేటర్ ఓటర్లు టీఆర్ఎస్‌ను ఎందుకు తిరస్కరించారు, అసలు ఏం జరిగింది, వరద సాయం పంపిణీ చేసినా అనుకూల పరిస్థితులు ఎందుకు కలిసి రాలేదు, మొత్తం పార్టీ సైన్యాన్ని రంగంలోకి దించినా ఎందుకు ఫలితం లేకపోయింది లాంటి అంశాలపై సీనియర్ నేతలను, మంత్రులను సీఎం చాలా సీరియస్ గానే నిలదీసినట్లు పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి చేయాల్సినవన్నీ చేసినా ఎందుకు భిన్నమైన తీర్పు వచ్చిందని, ఆశించిన స్థాయిలో మంత్రులు, ఇన్ చార్జీలు పని చేయలేదని చివాట్లు పెట్టినట్లు తెలిసింది.

గ్రేటర్ ఎన్నికలను భుజాన వేసుకున్న మంత్రి కేటీఆర్ కు కూడా సీఎం నుంచి ఆగ్రహం తప్పలేదని, సమాధానం ఇచ్చినా సంతృప్తి చెందలేదని తెలిసింది. వంద సీట్లు ఖాయం, సొంత బలంతోనే మేయర్ పదవిని దక్కించుకుంటామని, ఏ పార్టీ మద్దతూ అవసరం లేదని గంభీర ప్రకటనలు చేసినా ఇప్పుడు పరిస్థితి మొత్తం చేయి దాటిపోయిందని, పార్టీ శ్రేణులకు మాత్రమే కాక ప్రజలకు ఏం సమాధానం చెప్పాలంటూ కేటీఆర్‌ను తీవ్రంగానే మందలించినట్లు సమాచారం. మజ్లిస్‌ను కాదని ఇంకెక్కడి నుంచీ టీఆర్ఎకు మద్దతు లభించే అవకాశమే లేదని, స్వచ్ఛందంగా టీఆర్ఎస్ వైపు వస్తారనే నమ్మకం కూడా లేదని మండిపడినట్లు తెలిసింది. ముందుకు పోలేక వెనక్కి వెళ్లే మార్గం లేక ఇటు జీహెచ్ఎంసీ మేయర్ సీటు విషయంలోనేగాక రానున్న కాలంలో ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకం కలిగేలా వ్యవహరించడానికి తీవ్ర స్థాయిలో కసరత్తు చేయాల్సి ఉంటుందని, సీనియర్ నాయకులు మొదలు గ్రామ స్థాయి కార్యకర్త వరకు ప్రత్యేక క్యాంపెయిన్ రూపంలో కార్యాచరణ చేపడితే తప్ప పార్టీకి జరిగిన నష్టాన్ని పూడ్చుకోలేమనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed