చార్జీలు తగ్గించాలా.. రాయితీలివ్వాలా?

by Anukaran |
చార్జీలు తగ్గించాలా.. రాయితీలివ్వాలా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: సామాన్య ప్రజలకు గుదిబండగా మారిన ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. జీహెచ్ఎంసీ ఎన్నికలలో ప్రత్యక్షంగా చేదు అనుభవాన్ని ఎదుర్కోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిమీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. త్వరలో నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరుగనుంది. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, వరంగల్, ఖమ్మం జిల్లాల కార్పొరేషన్ ఎన్నిలు కూడా ఉన్నందున పార్టీ పరిస్థితిని మెరుగుపర్చుకోడానికి, ప్రజల అసంతృప్తిని చల్లార్చడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ విషయంలో పాత పద్ధతినే అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నందున ఎల్ఆర్ఎస్‌ను కూడా కొలిక్కి తేవాలని భావిస్తున్నారు. ఇప్పటికే అధికారులతో సంప్రదింపులు మొదలుపెట్టారు. రెండు వారాలలోనే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు.

విపక్షాల ఎదురుదాడి

ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎల్ఆర్ఎస్ అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా తీసుకుని అధికార పార్టీని ఇరుకున పెడుతున్నారు. ‘ఎల్ఆర్ఎస్ పోవాలంటే టీఆర్ఎస్ పోవాలి’ అనే నినాదాన్ని అందుకున్నారు. ముఖ్యమంత్రికి బహిరంగ లేఖలు రాసి ఎల్ఆర్ఎస్ విషయంలో వెనక్కి తగ్గాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా ‘నో ఎల్ఆర్ఎస్, నో టీఆర్ఎస్, గో కేటీఆర్’ అంటూ బీజేపీ కార్యకర్తలు, ప్రజలు నిరసన తెలిపారు. తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ కోడాప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. వచ్చే ఏడాది జూన్ వరకు ఆరు నెలల పాటు ఆందోళనకు కార్యాచరణను ప్రకటించింది. ఎన్నికలలో టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని హెచ్చరించింది.

ఇంత ఆగ్రహమా?

ప్రజల నుంచి, పార్టీల నుంచి వ్యతిరేకత బాగా వ్యక్తమవుతుండడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్ఆర్ఎస్ అంశాన్ని పరిష్కరించాలనుకుంటున్నారు. ప్రజలపై భారాన్ని తగ్గించాలనుకుంటున్నారు. ఇందుకోసం ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ప్రకటించినదాని ప్రకారం ఎల్ఆర్ఎస్ భారం ప్రజల మీద రూ. 50 వేలు, రూ. 75 వేల నుంచి లక్షల రూపాయల వరకు పడుతోంది. ఇప్పటికిప్పుడు అంత ఎక్కువ మొత్తంలో డబ్బును సమకూర్చుకోడానికి వారు ఇబ్బంది పడుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఓట్ల రూపంలో ఆగ్రహం వ్యక్తమైంది. అది రిపీట్ కాకుండా ఉండేందుకు సీఎం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా నామమాత్రపు ధరలనే ఖరారు చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. ఎల్ఆర్ఎస్ ను కొంతకాలం పాటు వాయిదా వేయడమా? లేక చార్జీలను భారీగా తగ్గించడమా? మొత్తానికే ఎత్తివేయడమా? తక్కువ విస్తీర్ణం ఉన్నవారిని ఈ పరిధి నుంచి తప్పించడమా? కొన్ని రాయితీలు ప్రకటించడమా? ఇలా అనేక కోణాల నుంచి సీఎం ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

ఆరు నెలల ప్రణాళిక

నగరంలో శనివారం సమావేశమైన రియల్టర్ల అసోసియేషన్ రానున్న ఆరు నెలల కాలానికి యాక్షన్ ప్లాన్ ప్రకటించింది. పోస్టుకార్డుల ఉద్యమం మొదలు వంటావార్పు, కలెక్టరేట్ల ముట్టడిలాంటివాటికి రూపకల్పన చేసింది. రానున్న అన్ని ఎన్నికలలో టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని ఆ సంఘం అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. విశ్వనగరంగా తీర్చిదిద్దాలనుకుంటున్న సమయంలో రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారి నుంచి ఆందోళన మొదలైతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. పెట్టుబడుల ఆకర్షణకు విఘాతం కలుగుతుంది. ఆదాయ వనరులకు ముప్పు ఏర్పడుతుంది. దీర్ఘకాలిక ఎఫెక్ట్ పడుతుందని ఆందోళన ప్రభుత్వ స్థాయిలో మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి, పార్టీకి గుదిబండగా మారనున్న ఎల్ఆర్ఎస్ విషయంలో స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోవడం అనివార్యమవుతోంది. భవన నిర్మాణ రంగంతోపాటు అనుబంధంగా ఉండే రిజిస్ట్రేషన్లు, విద్యుత్, ప్లంబింగ్, సిమెంటు, ఇనుము తదితర పలు రకాల వ్యాపారులు, వారి కుటుంబాలు పార్టీకి దూరమైతే అసలుకే ముప్పు వస్తుందనే ఆందోళన టీఆర్ఎస్‌కు లేకపోలేదు. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ నగరానికి అద్భుత అవకాశాలు ఉన్నాయని సీఎం వ్యాఖ్యానించిన సమయంలో అదే రంగం నుంచి హెచ్చరికలు రావడం ఒకింత ఆందోళన కలిగించినట్లయింది. ఎట్టి పరిస్థితులలోనూ ఎల్ఆర్ఎస్‌ను ఉపసంహరించుకోవాలన్నది రియల్టర్ల డిమాండ్. ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు.

రియల్టర్ల నిరసన షెడ్యూలు :

డిసెంబర్
21 : గవర్నర్‌కు, సీఎంకు పోస్టుకార్డులు
22 : అసోసియేషన్ తరఫున భిక్షాటన
24 : రోడ్లపై వంటావార్పు
26 : ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడి, విజ్ఞాపన పత్రాల అందజేత
28 : కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడి, వినతి పత్రాలు
29 : జాతీయ రహదారుల దిగ్బంధం
జనవరి
02 : రిలే నిరాహార దీక్షలు

Advertisement

Next Story

Most Viewed