కేసీఆర్‌కు గుడి కట్టినా గుర్తింపులేదాయే!

by Shyam |   ( Updated:2021-01-13 03:01:07.0  )
కేసీఆర్‌కు గుడి కట్టినా గుర్తింపులేదాయే!
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కేసీఆర్ అంటే గుండెల్లోనే కాదు.. ఏకంగా ఇంటి ముందు గుడి కట్టేంత వీరాభిమానం.. తెలంగాణ స్వరాష్ట్రం కోసం నిరంతరం పరితపించారు.. ఉద్యమాలు, నిరసనలు, ఆందోళనలు, దీక్షలు చేశారు.. 30కిపైగా బైండోవర్ కేసుల్లో పోలీసు స్టేషన్ల చుట్టు తిరిగారు.. ఆర్థిక ఇబ్బందులున్నా.. ఏ మాత్రం ఆదాయం లేకపోయినా.. సొంత డబ్బులతో ఇంటి ముందు అధినేతకు గుడి కట్టి పూజిస్తున్నారు.. సొంత డబ్బులతో తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ సార్‌లకు కూడా విగ్రహాలు నిర్మించారు.. దండేపల్లికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు గుండ రవీందర్. పార్టీ కోసం, అధినేత కోసం ఇంత చేసినా.. రవీందర్‌కు పార్టీలో కనీస గుర్తింపు, ప్రాధాన్యత లేకపోగా.. తన జీవనాధారాన్ని వేరేవారు లాగేసుకుంటే కాళ్లరిగేలా తిరిగినా.. కనీసం పట్టించుకునే వారు పార్టీలో లేకుండా పోవటం విచారకరం.

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రానికి చెందిన గుండ రవీందర్‌‌కు టీఆర్ఎస్, ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అంటే ఎనలేని అభిమానం. అధినేతను తన గుండెల్లో గూడు కట్టుకోవటంతో పాటు.. ఏకంగా ఇంటి ముందు గుడి కట్టి నిత్యం పూజిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలనే ఆకాంక్ష బలంగా ఉన్న ఈయన.. 2010 నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జెండా మోసిన ఉద్యమకారుడు. దండేపల్లి మండలంలో పార్టీ జెండా మోస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పదవులు, పనులు, పైసలు, ప్రతిఫలం ఆశించకుండా కేసీఆర్, పార్టీ మీద అభిమానంతో పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో దండేపల్లి మండల పార్టీ అధికార ప్రతినిధిగా పని చేశారు.

అయితే, గుండ రవీందర్ మేదరిపేటలో కేబుల్ నెట్‌వర్క్ నిర్వహించేవారు. నెలకు రూ.10వేల నుంచి 15వేల ఆదాయంతో జీవనం నెట్టుకొచ్చారు. ఇదే సమయంలో పార్టీ కోసం తన సొంత డబ్బులు వెచ్చించారు. దీనికి తోడు దండేపల్లి చౌరస్తాలో రూ.70వేలతో తెలంగాణ తల్లి విగ్రహం, రూ.50వేలతో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాలను కూడా తన డబ్బులతోనే నిర్మించారు. అయితే, ప్రస్తుతం పే చానల్స్‌ రావటంతో.. కేబుల్ నెట్‌వర్క్ ఆదాయం అంతంత మాత్రమే వస్తోంది. దీంతొ చివరికి తనకున్న 2ఎకరాల పొలం కూడా అమ్ముకున్నారు.

ఇటువంటి పరిస్థితుల నడుమ తాను నిర్వహించే కేబుల్ నెట్ వర్కును 2018లో ఒకరు అక్రమంగా లాక్కున్నారు. ఈ ప్రభావంతో జీవనాధారం కాస్త పోయి బతుకు రోడ్డున పడింది. స్థానిక పోలీసులు, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావుకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా.. పరిష్కారం కాలేదు. దీంతో ఆయన పూజించే సీఎం కేసీఆర్, కేటీఆర్‌ను కలిసేందుకు ప్రగతి భవన్ చుట్టు తిరిగినా.. ఇప్పటి వరకు అపాయింట్మెంట్ లభించలేదు. చాలా సార్లు తెలంగాణ తల్లి విగ్రహం ముందు, కేసీఆర్‌కు తాను కట్టిన గుడి ముందు ధర్నా, దీక్ష చేశారు. ఓ సారి ఉదయం నుంచి సాయంత్రం వరకు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపినా.. రవీందర్ సమస్య పరిష్కారం కాలేదు.

చివరకు ఈ విషయం పార్టీ వారికి తెలిసింది. అప్పటి ఎంపీ, ప్రస్తుత విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు వద్దకు సమస్యను తీసుకెళ్లినా పరిష్కారం మాత్రం లభించలేదు. ఈ పరిణామాలతో గుండ రవీందర్ విసిగిపోయారు. పార్టీలో ప్రాధాన్యత లభించకపోగా.. తన జీవనాధారం లేకుండా చేసిన వారిపై చర్యలు లేవని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. చివరకు బతుకు రోడ్డున పడితే పార్టీలో పట్టించుకునే వారు కరువయ్యారన్న బాధతో పార్టీకి రాజీనామా చేశారు.

కేసీఆర్ అంటే అభిమానమే: గుండ రవీందర్, తెలంగాణ ఉద్యమకారుడు

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే నాకు ఎనలేని అభిమానం ఇప్పటికీ ఉంది. పార్టీలో ఉద్యమకారులకు గుర్తింపు లేదు. కేసీఆర్‌కు గుడి కట్టి పూజిస్తున్న.. తెలంగాణ తల్లి, జయశంకర్ సారు విగ్రహాలు సొంత డబ్బులతో ఏర్పాటు చేయించా. ఆందోళనలు, నిరసనలు, దీక్షలు చేసిన.. 30కిపైగా బైండోవర్ కేసులు ఉన్నాయి. పార్టీలో ఎలాంటి గుర్తింపు, ప్రాధాన్యత లేదు. నా జీవనాధారం మరొకరు లాక్కుంటే పార్టీలో పట్టించుకునే వారే లేరు. అధినేత కేసీఆర్‌ను కలిసే ప్రయత్నాలు ఫలించలేదు. తిరిగి తిరిగి విసిగిపోయా.. స్థానిక ఎమ్మెల్యే, విప్ పట్టించుకోవటం లేదు. నాకున్న జీవనాధారం పోయింది. రెండెకరాల భూమి అమ్ముకున్న ప్రయోజనం లేదు. పార్టీ కోసం సొంత పైసలు ఖర్చు పెట్టినప్పటికీ గుర్తింపు లేదని భార్య పిల్లలు తిడుతున్నారు. బతుకు రోడ్డున పడితే.. కనీసం పట్టించుకునే దిక్కు లేదు. పార్టీ కోసం ఇంత చేస్తే.. పార్టీ అంటే ఇంతేనా.. అందుకే బయటకు వచ్చేశాను. పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేశాను. పార్టీలో ఉద్యమకారులకు గుర్తింపు అటుంచితే.. ఆపద, సమస్య వస్తే పట్టించుకునేవారు లేరని గుండా రవీందర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed