కేసీఆర్ మీటింగ్‌లో హాట్ టాపిక్ ఇదే

by Shyam |
కేసీఆర్ మీటింగ్‌లో హాట్ టాపిక్ ఇదే
X

దిశ, తెలంగాణ బ్యూరో : సభ్యత్వ నమోదు, పార్టీని బలోపేతం చేయడం, సంస్థాగత వ్యవహారాలు తదితరాలను ఎజెండాలో ప్రధానాంశాలుగా పెట్టుకున్నప్పటికీ వీటికంటే సీఎం మార్పుపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆరు అంశాల ఎజెండాను సమావేశానికి హాజరయ్యే పార్టీ నేతలందరికీ కార్యాలయం పంపిణీ చేసింది. కానీ వీటికంటే ఇతర అంశాలపైనే కేసీఆర్ ఎక్కువగా ఫోకస్ పెట్టారు. పార్టీ ప్రస్థానం, బలోపేతం, క్రమశిక్షణ అంశాలను నొక్కిచెప్పిన కేసీఆర్ వివిధ స్థాయిల్లో పార్టీ ఇన్‌చార్జిలను నియమించడం, సభ్యత్వ నమోదుతోపాటు పార్టీ కమిటీల ఎన్నికల నిర్వహణ, రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోడానికి పార్టీలో ఎన్నికల అధికారిని నియమించడం, రాష్ట్రకమిటీ సభ్యుల నియామకం, కమిటీల స్వరూపం, పార్టీ సంస్థాగత ఎన్నికల కోసం నామినేషన్ పత్రాల నమూనా.. ఇవీ ఎజెండాలో పెట్టుకున్న అంశాలు.

బీజేపీ ఊసెత్తలే

పార్టీ ప్రస్థానాన్ని సుదీర్ఘంగా వివరించిన కేసీఆర్ ఢిల్లీ టూర్ విశేషాలనుగానీ, కేంద్రంతో ఇకపైన కొనసాగించనున్న సంబంధాలపై స్పష్టతనుగానీ పార్టీ శ్రేణులకు వివరించలేదు. తన రెండున్నర గంటల ప్రసంగంలో బీజేపీని ఎక్కడా ప్రస్తావించలేదు. రాష్ట్రంలో కొద్దిమంది బీజేపీపై దూకుడుగా విమర్శలు చేస్తుంటే, పార్లమెంట్ సభ్యులు ప్రశంసిస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌పై కూడా రాష్ట్ర, ఢిల్లీ స్థాయిలో భిన్న ధోరణులు కనిపిస్తున్నాయి. వీటి గురించి వివరణ ఇవ్వని కేసీఆర్ కొన్నింటిని బైటకు చెప్పలేమని మాత్రం శ్రేణులకు అర్థం చేయించే ప్రయత్నం చేశారు. కొన్ని బైటకు చెప్పకూడనివి ఉంటాయని మాత్రం చెప్పారు.

జిల్లాలకు ఇన్‌చార్జిల నియామకం

రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకు సభ్యత్వ నమోదు కోసం పార్టీ తరఫున సెక్రటరీ ఇన్‌చార్జి, జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జి పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ప్రతి జిల్లాకూ సెక్రటరీ ఇన్‌చార్జిని నియమించినా కొన్నిచోట్ల మాత్రం రెండు, మూడు జిల్లాలకు కలిపి ఒక జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జిని ప్రకటించారు. హైదరాబాద్ జిల్లాకు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జిగా నరేంద్రనాథ్‌ను నియమించారు. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు మంత్రి సత్యవతి రాథోడ్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జనగాం, వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాలకు గ్యాదరి బాలమల్లు… ఇలా అన్ని జిల్లాలకు ఇన్‌చార్జిల నియామకం జరిగింది.

Advertisement

Next Story

Most Viewed