హుజూరాబాద్‌లోనే సంపూర్ణం.. ‘దళితబంధు’పై సీఎం క్లారిటీ

by Anukaran |   ( Updated:2021-08-16 00:36:56.0  )
dalitha bandhu
X

దిశ, తెలంగాణ బ్యూరో : దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్నామని, హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా సంపూర్ణంగా అమలు చేయనున్నామని, మిగిలిన నియోజకవర్గాల్లో పాక్షకంగానే ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పేద దళిత కుటుంబాలకు ఆర్థిక ప్రేరణ ఇచ్చేందుకే రూ.10 లక్షల చొప్పున నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఈ సాయాన్ని పూర్తిగా గ్రాంటు రూపంలోనే ఇస్తున్నదని, బ్యాంకులతో సంబంధం లేదని, తిరిగి చెల్లించాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేశారు.

పంద్రాగస్టు సందర్భంగా గోల్కొండ కోటలో పతాకావిష్కరణ చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలుచేస్తున్నందున దళిత కుటుంబాలన్నింటికీ తలా రూ.10 లక్షల చొప్పున అందుతాయని, మిగిలిన నియోజకవర్గాల్లో పాక్షికంగానే పథకం అమలవుతుందని సీఎం కేసీఆర్ వివరించారు. మెడికల్ షాపులు, ఎరువుల దుకాణాలు, ఆస్పత్రులు, హాస్టళ్లు, ఫుడ్ సప్లయ్ కాంట్రాక్టు పనులు, వైన్ షాపులు, బార్ షాపులు లాంటివి పెట్టుకోవాలని దళితులు భావించినట్లయితే వారికి లైసెన్సు మంజూరులో ప్రత్యేక రిజర్వేషన్‌ను ఇవ్వనున్నట్టు చెప్పారు.

సృష్టికర్తనే నేనే..

దళితులు స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలనేందుకు రూపమే దళిత బంధు పథకమని, ఆర్థికంగా అభివృద్ధి చేసి వారిని సమాజంలో నిలబెట్టాలని దళిత బంధు పథకాన్ని తానే రూపొందించినట్లు సీఎం ప్రకటించారు. దళితులను ఆర్థికంగా బలోపేతం చేసి సామాజిక వివక్ష నుంచి విముక్తి కలిగించడమే లక్ష్యంగా ఈ పథకానికి స్వయంగా తానే రూపకల్పన చేసినట్లు తెలిపారు. దళితుల జీవితాల్లో ఈ పథకం నూతన క్రాంతిని సాధిస్తుందని తాను సంపూర్ణంగా విశ్వసిస్తున్నట్లు నొక్కిచెప్పారు. అణగారిన దళిత జాతి అభ్యున్నతికి పాటుపడడమే నిజమైన దేశభక్తి, దైవ సేవ అని పేర్కొన్నారు. ఈర్ష్యా అసూయలకు తావు లేకుండా వారంతా ఒక్క తాటిమీద నిలబడాలని, దళిత సమాజానికి ఒక నమ్మకాన్ని ఇవ్వాలని సీఎం పిలుపునిచ్చారు. కులం పేరుతో ఉన్న ఇనుప గోడలను, ఇరుకు మనస్తత్వాలను బద్దలు కొట్టాలన్నారు. దళిత జాతిని ప్రత్యేక శ్రద్ధతో ఆదుకోవడం నాగరిక సమాజ, ప్రజాస్వామిక ప్రభుత్వాల బాధ్యత, ప్రాథమిక విధి అని వ్యాఖ్యానించారు.

వాక్‌శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి అనే మూడింటితో ఆశించిన గమ్యాన్ని చేరుకుంటామని, భవిష్యత్తులో ప్రభుత్వం మరిన్ని అద్భుతాలను సృష్టించి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందన్నారు. రాజ్యాంగం ప్రవచించిన సమానత్వ విలువల సాధనలో తెలంగాణ రాష్ట్రం దళితబంధు ద్వారా నూతన ప్రమాణాలను నెలకొల్పుతున్నదని చెప్పారు. ఇంతకాలం వివక్షకు గురైన దళితులు ఇకపైన వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదిగి సమాజంలో ఆత్మగౌరవంతో జీవిస్తారని, దళితబంధు ద్వారా అది నూటికి నూరు పాళ్లు సాకారమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఉద్యోగుల విభజన తర్వాతే ఖాళీ పోస్టుల భర్తీ..

నూతన జిల్లాల పోస్టులు, ఉద్యోగుల విభజన ప్రక్రియ కొత్త జోనల్ విధానం ప్రకారం పూర్తయ్యే ప్రక్రియ పురోగతిలో ఉన్నదని, ఆ తర్వాతనే రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీ జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో దీర్ఘకాలం చర్చించి, తీవ్రంగా ప్రయత్నించిన తర్వాత స్థానికులకు 95% ఉద్యోగాలు దక్కేలా రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ జరిగిందని, నూతన జోనల్ వ్యవస్థ ఉనికిలోకి వచ్చిందని చెప్పారు. జోనల్​ విధానం ప్రకారం ఉద్యోగుల బదిలీలు చేసిన తర్వాత ఖాళీలపై నివేదిక వస్తుందని, ఆ తర్వాత భర్తీ ప్రక్రియ ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.

రైస్​ బౌల్​ ఆఫ్​ ఇండియాగా తెలంగాణ..

గత ఏడాది ధాన్యం కొనుగోళ్లలో దేశంలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ.. ప్రస్తుతం నంబర్ వన్ దిశగా అడుగులు వేస్తున్నదని సీఎం కేసీఆర్​ వెల్లడించారు. ఏడాది యాసంగిలో ఎఫ్​సీఐ దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో 56 % తెలంగాణే అందించగలిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి, గిట్టుబాటు ధరకు రైతుల నుంచి చివరి గింజ వరకూ ధాన్యం సేకరిస్తున్నదని సీఎం తెలిపారు. ధాన్యం దిగుబడి, కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం కనీవినీ ఎరుగని ప్రగతిని సాధించిందని, 2013-14 లో రాష్ట్రంలో దాదాపు 49 లక్షల ఎకరాల్లో వరిపంట సాగయితే, 2020-21 ఆర్థిక సంవత్సరంలో కోటీ ఆరు లక్షల ఎకరాల్లో సాగయిందన్నారు. 60.54 లక్షల ఎకరాల విస్తీర్ణం లో పత్తి పంట సాగయిందని, 31 లక్షల 60 వేల బేళ్ల పత్తి ఉత్పత్తి అయిందని, పత్తి సాగులో దేశంలోనే తెలంగాణా రెండో స్థానంలో నిలిచిందని, మన దగ్గర పండిన పత్తికి నాణ్యమైనదనే పేరుందని, అందుకే మార్కెట్​లో డిమాండ్​ ఎక్కువని చెప్పారు.

నేటి నుంచే రుణమాఫీ..

రాష్ట్రంలో మూడు లక్షల మంది రైతులకు రూ.25 వేల వరకు ఉన్న పంట రుణాలను ప్రభుత్వం ఇప్పటికే మాఫీ చేసిందని, సోమవారం నుంచి రాష్ట్రంలోని 6 లక్షల మంది అన్నదాతలకు రూ.50 వేలలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తున్నామని, ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని సీఎం చెప్పారు. దీంతో మొత్తం 9 లక్షల మంది రైతన్నలు రుణ విముక్తులవుతారని పేర్కొన్నారు. మిగిలిన వారికి కూడా దశలవారీగా రుణమాఫీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టం చేశారు.

బీమాతో నేతన్నకు ధీమా..

చేనేత కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక పథకాలను రూపొందించిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చేనేతలకు 50 శాతం సబ్సిడీ మీద నూలు, రసాయనాలు, రంగులు ప్రభుత్వం అందజేస్తుందని, చేనేత కార్మికుల కుటుంబాలను మరింత ఆదుకోవడానికి రాష్ట్రంలో రైతన్నలకు అమలుచేస్తున్న రైతుబీమా తరహాలో త్వరలోనే చేనేత బీమా పథకం అమలు చేస్తామన్నారు. దురదృష్టవశాత్తు ఏ నేత కార్మికుడైనా మరణిస్తే ఈ పథకం కింద అతని కుటుంబం ఖాతాలో రూ.5 లక్షల బీమా సొమ్ము జమవుతుందని, చేనేత రంగాన్ని ఆదుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక కార్పస్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్​ ప్రకటించారు.

Advertisement

Next Story