కాంగ్రెస్‌కు కేసీఆర్ బిగ్ పంచ్.. హుజూరాబాద్​ టీఆర్ఎస్ టికెట్​ ఆయనకే..!

by Anukaran |   ( Updated:2021-07-27 23:41:56.0  )
Congress Leader Swargam Ravi, Chief Minister KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ​పార్టీ నాయకుడు స్వర్గం రవికి హుజూరాబాద్​ టీఆర్‌ఎస్ టికెట్​ కేటాయించనున్నట్టు తెలుస్తున్నది. బీసీ సామాజిక వర్గానికి చెందిన రవి పారిశ్రామికవేత్తగా హుజూరాబాద్​ ప్రాంత వాసులకు సుపరిచితుడు. 15 ఏండ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగుతూ ప్రజలకు అందుబాటులో ఉంటుండటం కలిసొచ్చే అంశం. ఇప్పటికే కొన్ని వర్గాల ఓట్లు గంపగుత్తగా టీఆర్‌ఎస్ ఖాతాలోకి వచ్చాయని అంచనా వేస్తున్న గులాబీ బాస్.. స్వర్గం రవికి అభ్యర్థిత్వం ఖరారు చేస్తే బీసీ వర్గాల నుంచి కలిసి వస్తుందని అంచనా వేస్తున్నట్లు ప్రగతిభవన్​వర్గాల్లో టాక్.

బీసీ అస్త్రమే..!

అసైన్డ్ భూముల ఆరోపణల తర్వాత ఈటల రాజేందర్ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ కావడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో హుజురాబాద్​ సెగ్మెంట్‌కు ఉప ఎన్నిక అనివార్యమయింది. కొన్నేండ్ల పాటు అక్కడ తిరుగులేని నేతగా ఉన్న ఈటలను ఢీకొట్టేందుకు బీసీ వర్గాన్నే బరిలోకి దింపాలనే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పలువురి రాజకీయ చరిత్రను పరిశీలించిన కేసీఆర్.. తాజాగా స్వర్గం రవికి అనుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హుజురాబాద్‌లో గులాబీ పార్టీ తరపున బరిలోకి దింపేందుకు ఇప్పటికే అనేక మంది పేర్లు పరిశీలనకు వచ్చాయి. ఈ నియోజకవర్గంలోని ద్వితీయశ్రేణి నాయకులతో ప్రయోగాలు చేసే కంటే ఈటలను ఢీకొనేందుకు దీటైన అభ్యర్థినే రంగంలోకి దింపాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రవి పేరును పరిశీలిస్తున్నట్లు చెప్పుతున్నారు.

స్వర్గం రవి బీసీ వర్గానికి చెందిన నాయకుడు కావడం, అదే వర్గానికి చెంది ఓట్లు కూడా అత్యధికంగా ఉండటం అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా 15 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పీసీసీ ఆర్గనైజింగ్​ సెక్రెటరీగా పని చేశారు. తెలంగాణ ఉద్యమంలో హుజురాబాద్​ నియోజకవర్గంలో తొలి ధూంధాం కూడా ఉప్పల్‌లో స్వర్గం రవి ఆధ్వర్యంలోనే నిర్వహించారు. అంతేగాకుండా.. పద్మశాలి తెలంగాణ గర్జనతో పాటు తెలంగాణ గర్జన విజయవంతంలో ఆయన సాయమందించారు. దీనికి తోడుగా రాజకీయాల్లో ఆయనకు క్లీన్​ ఇమేజ్​ కూడా ఉంది. వివాదరహితుడిగా ఉంటూ అన్ని పార్టీల నేతలతోనూ సత్సంబంధాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఏడేండ్లు కాంగ్రెస్​ పార్టీకి కష్టకాలం ఉన్నా.. పార్టీ కేడర్‌ను కాపాడుకోవడంలో రవి ఒకింత ముందంజలో ఉన్నారు.

సర్వేలో కూడా సానుకూలత

హుజురాబాద్​ నియోజకవర్గంలో ఇప్పటికే పలుమార్లు కేసీఆర్ ​చేయించిన సర్వేలో స్వర్గం రవికి సానుకూలత ఉన్నట్లు తేలిందని సమాచారం. హుజురాబాద్​ నుంచి ఇప్పటి వరకు కౌశిక్​రెడ్డి, స్వర్గం రవి, గెల్లు శ్రీనివాస్ ​యాదవ్, ముద్దసాని మాలతి, ముద్దసాని పురుషోత్తం రెడ్డిల పేర్లను సూచిస్తూ సర్వే నిర్వహించినట్లు పార్టీ నేతలు చెప్పుతున్నారు. ఈ ఐదుగురిలో పలువురిపై కొన్ని బలహీనతలు తేలినా.. స్వర్గం రవి విషయంలో మాత్రం సానుకూలత ఉన్నట్లు నిఘా వర్గాల రిపోర్టులో తేలినట్లు తెలుస్తోంది. సర్వే నివేదికలు, ఇంటలీజెన్సీ వర్గాల నివేదికలో రవికి అనుకూలత ఉండటంతో ఆయన అభ్యర్థిత్వం ఖరారుకే కేసీఆర్ ​మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కాగా, దాదాపు 15 ఏండ్లు కాంగ్రెస్​ పార్టీలో ఉన్న రవి ఇటీవలే సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. టికెట్ ​కేటాయించే అంశంపై సీఎంకు వివరించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మాజీ ఎంపీ వినోద్​ కుమార్ ​నుంచి మొదలుకుని అక్కడి ద్వితీయశ్రేణి నేతల వరకు టికెట్​ ఎవరికి వస్తుందనే ప్రచారం జరిగిన నేపథ్యంలో స్వర్గం రవి పేరు తెరపైకి వచ్చింది. ఆయనకు పార్టీ టికెట్​ ఖరారు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రగతిభవన్​ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై గులాబీ బాస్​ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.

Advertisement

Next Story