ఈటలకు మరోసారి చెక్.. వ్యూహాలు రచిస్తున్న గులాబీ బాస్

by Anukaran |
Eatala Rajende And Kcr
X

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి ఈటల రాజేందర్‎కు చెక్​పెట్టేందుకు గులాబీ బాస్​ పక్కా వ్యూహాలు రచిస్తున్నట్లు తేటతెల్లమవుతోంది. ఇప్పటికే ఆయా వర్గాలను దగ్గరకు తీస్తున్న కేసీఆర్.. అదే సామాజిక వర్గంలో కూడా వ్యతిరేకత రాకుండా చూసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు సంఘాలు, ముదిరాజ్ సంఘాలతో అటు రాజ్యసభ ఎంపీ బండా ప్రకాష్‌‌తో సంప్రదింపులు చేస్తున్నారు. బీసీ నినాదంతో చెక్​ పెట్టేందుకు ఎల్​. రమణతో పాటు ఆయా బీసీ సంఘాల నేతలు, పార్టీలోని బీసీ నేతలు, మంత్రులను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే.

అయితే ఈటల రాజేందర్‌తో అదే సామాజికవర్గానికి చెందిన అందె బాబన్న, వీకే మహేష్‌లు ఈటల వెంట నడుస్తున్నారు. ఇప్పటికే ముదిరాజ్​ సామాజికవర్గానికి చెంది కాసాని జ్ఞానేశ్వర్​ టీఆర్‌ఎస్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో అదే కమ్మూనిటీకి చెందిన నేతలకు పార్టీలో, పదవుల్లో అవకాశం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

దీనిలో భాగంగా తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్టు పిట్టల రవీందర్‌కు ఈసారి మండలిలో స్థానం కల్పించేందుకు సీఎం కేసీఆర్​ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీలో దీనిపై చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ జేఏసీ సమన్వయకర్తగా, కన్వీనర్‌గా ఉద్యమంలో ప్రధాన భూమికను పోషించిన పిట్టల రవీందర్ ఇప్పటికే తెలంగాణ ముదిరాజ్ మహాసభను స్థాపించి, ఆ సామాజికవర్గానికి ప్రతినిధిగా ఉంటున్నారు. అంతేకాకుండా బొగ్గుగని పోరాటాలతో మమేకమైన పలు జిల్లాల్లో ఆయనకు సంబంధాలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆయనకు మండలిలో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర జనాభాలో 12 శాతం ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి అవకాశం కల్పించి, ఈటల రాజేందర్ వ్యవహారంతో ఉన్న వ్యతిరేకతను తొలగించుకోవాలని గులాబీ బాస్ ప్లాన్​వేస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed