మెట్రో సేవలను అభినందించిన సీఎం కేసీఆర్

by Shyam |   ( Updated:2021-06-25 12:01:48.0  )
CM KCR
X

దిశ, సిటీ బ్యూరో: కరోనా వైరస్ కలవరపెడుతున్న విపత్కర పరిస్థితుల్లోనూ మెట్రో రైలు ప్రయాణికులకు ఎంతో సురక్షితమైన సేవలందించే ప్రజా రవాణా వ్యవస్థగా మారిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. మెట్రో రైలు వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించే దిశగా చర్యలు తీసుకోవాలని అందుకు ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో సీఎం ఎల్ అండ్ టీ సంస్థ సీఈవో, ఎండీ ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యంతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. కరోనా కారణంగా మెట్రో నష్టాల్లో నడుస్తుందని, ఇలాంటి పరిస్థితుల్లో తమకు సహకారం అందించాలని ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరారు.

మెట్రోకు సంబంధించిన రవాణా తదితర అంశాలపై చర్చించిన సీఎం కేసీఆర్ వారి అభ్యర్థనలకు సానుకూలంగా స్పందించారు. మెట్రో రైలుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఏ మేరకు సహాయం చేయవచ్చో అన్న విషయాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఈ అంశంపై సమీక్ష నిర్వహించి తనకు నివేదికను అందజేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో హోం మంత్రి మహమూద్ అలీ, ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళిక సంఘం అధ్యక్షుడు బి. వినోద్ కుమార్, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, మెట్రో రైలు ఎండీ డా.ఎన్వీఎస్ రెడ్డి, సంస్థ డైరెక్టర్ డికే సేన్, ప్రాజెక్టుల సీఈవో అజిత్, హైదరాబాద్ మెట్రో సీఈవో కెవీబీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story