నేడు ఆ ఆసుపత్రిని ప్రారంభించనున్న జగన్

by srinivas |
నేడు ఆ ఆసుపత్రిని ప్రారంభించనున్న జగన్
X

దిశ, అమరావతి బ్యూరో: గుంటూరు ప్రభుత్వాసుపత్రి ఆవరణలో నాట్కో అధినేత నన్నపనేని వెంకయ్య చౌదరి విరాళం రూ.33 కోట్లతో నిర్మించిన నాట్కో కేన్సర్‌ సెంటర్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఉదయం 10గంటలకు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి రిమోట్‌ ద్వారా ప్రారంభించనున్నారు. దీనితో కేన్సర్‌ రోగులకు ఆధునిక వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ యూనిట్‌ నిర్మాణం కోసం ఆసుపత్రిలో ఎకరం స్థలంలో 80 వేల చదరపు అడుగుల పరిధిలో జి+3 నిర్మాణం జరిపారు. మొత్తం 110 పడకల సామర్ధ్యం గల ఈ యూనిట్‌లో కీమోథెరఫీ, రేడియాలజి, ఆపరేషన్‌ థియేటర్లు, ఇన్‌ పేషంట్‌ వార్డులు పూర్తి సౌకర్యాలతో నిర్మించారు. మొదట భవన నిర్మాణానికే వెంకయ్యచౌదరి ముందుకు వచ్చారు. అనంతరం మౌలిక సదుపాయాల కల్పన కూడా మరో రూ.15 కోట్లు వెచ్చించారు. ఇప్పటికే రూ.రెండు కోట్లతో లీనియర్‌ యాక్సలేటర్‌ను అమర్చారు. ఇప్పటికే నన్నపనేని వెంకయ్యచౌదరి జీజీహెచ్‌లోని పలు విభాగాల ఆధునికీకరణకు రూ.పది కోట్లకు పైగా వెచ్చించారు. చిన్నపిల్లల చికిత్స విభాగం, ఆర్ధో విభాగం, ఆపరేషన్‌ థియేటర్‌ ఆధునికీకరణ, న్యూరాలజీ విభాగానికి స్లీపింగ్‌ థియేటర్‌లను నిర్మించి ఇచ్చారు. కలెక్టర్‌ శ్యామ్యూల్‌ ఆనంద కుమార్‌, పలువురు ఉన్నతాదికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Advertisement

Next Story