ఆ నేత విషయంలో సీఎం జగన్ మాట తప్పారా?

by srinivas |
rajashekar
X

దిశ, ఏపీ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ పదవుల కేటాయింపులో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వారికి ఖచ్చితంగా పదవులు కట్టబెడుతూ అందరికీ న్యాయం చేస్తున్నారు. కేబినెట్ కూర్పు.. రాజ్యసభ సభ్యుల ఎంపిక.. నామినేటెడ్ పోస్టుల భర్తీ.. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఇలా అన్నింటిలోనూ సీఎం జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పార్టీలో ఎలాంటి అసంతృప్తికి తావివ్వకుండా ప్రజా సంకల్పయాత్రలో, పార్టీలో చేరినప్పుడు జగన్ హామీ ఇచ్చిన వారందరికీ న్యాయం చేస్తూనే ఉన్నారు. అయితే గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంకు చెందిన కీలక నేత మర్రి రాజశేఖర్‌ విషయంలో మాత్రం సీఎం జగన్ మాటతప్పారనే విమర్శలు ఉన్నాయి.

మరోసారి మెుండిచేయి..

మర్రి రాజశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినప్పుడు వైఎస్ జగన్ వెంట నడిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని ఒత్తిడులు వచ్చినా పార్టీ జెండా మాత్రం వీడలేదు. అంతేకాదు తన ఎమ్మెల్యే పదవిని సైతం త్యాగం చేశారు. 2019 ఎన్నికల ప్రచారంలో మర్రి రాజశేఖర్‌కు మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో పర్యటించిన జగన్ చిలకలూరిపేట నియోజకవర్గ అభ్యర్థి విడదల రజనీని గెలిపిస్తే మర్రి రాజశేఖర్‌ను మంత్రిని చేస్తానంటూ లక్షలాది మంది సాక్షిగా జగన్ హామీ ఇచ్చారు. జగన్ హామీతో నియోజకవర్గం కార్యకర్తలంతా సంబరాలు చేసుకున్నారు. ఎన్నికల్లో విడదల రజనీ గెలవడం, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడం జరిగిపోయింది. కానీ మర్రి రాజశేఖర్‌ మాత్రం మంత్రి కాలేకపోయారు. మర్రి రాజశేఖర్ మంత్రి కావాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా అయినా గెలవాలి లేదా ఎమ్మెల్సీ పదవి అయినా దక్కాలి. ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేకపోవడంతో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారని అంతా ఎదురుచూశారు. కానీ అనూహ్యంగా జగన్ ఆయనకు మెుండి చేయి చూపారు.

ఎమ్మెల్యే కోటాలో ఇస్తారనుకుంటే అప్పుడూ కేటాయించలేదు. పోనీ స్థానిక సంస్థల కోటాలో అయినా ఇస్తారనుకుంటే అక్కడా మెుండిచేయి చూపించారు. దీంతో మర్రి రాజశేఖర్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. వైఎస్ జగన్ మాటతప్పడు మడమ తిప్పడంటూ రాజకీయాల్లో పేరుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మర్రి రాజశేఖర్‌కు ఎలా న్యాయం చేస్తారనేదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నెలకొంది. త్వరలోనే కేబినెట్ విస్తరణ జరగనుంది. ఈ నేపథ్యంలో మర్రి రాజశేఖర్‌కు ఎలా మంత్రి పదవి కేటాయిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed