రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేసినవారికి ప్రత్యేకంగా బోనస్ ఇవ్వనున్న సర్కార్

by srinivas |   ( Updated:2021-12-20 20:31:13.0  )
Farmers2
X

దిశ, ఏపీ బ్యూరో: రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ సూచించారు. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రత్యామ్నాయ పంటలు పండించేలా రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఆ పంటలు పండించే వారికి ప్రత్యేక బోనస్‌ ఇచ్చే అంశాన్నిఅధికారులు పరిశీలించాలన్నారు. ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేయాలని, పంటల కొనుగోలు బాధ్యతను కూడా ప్రభుత్వమే చేపడుతుందన్న విషయాన్ని రైతులకు తెలపాలన్నారు. రైతులకు మంచి ఆదాయాల కల్పన దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. సీఎం ఆదేశాలను చూస్తే రాబోయే రోజుల్లో వరి సాగు తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రత్యామ్నాయ పంటలపై ఎలా ఫోకస్ పెట్టారో అదే బాటలో సీఎం జగన్ సైతం నడుస్తున్నట్లు సమాచారం.

సేవల్లో అలసత్వం వద్దు

రైతులకు సేవలందించడంలో ఎలాంటి అలసత్వం, సమాచార లోపం ఉండొద్దని అధికారులను ఆదేశించారు. తరచుగా రైతులతో ఇంటరాక్ట్‌ అవ్వాలని, రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి గతంలో ఎవ్వరూ ముందుకొచ్చిన దాఖలాలు లేవన్నారు. రైతులకు తోడుగా నిలవడానికి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండొద్దని, కొనుగోలు తర్వాతే మిల్లర్ల పాత్ర ఉండాలన్నారు. ధాన్యం నాణ్యతా పరిశీలనలో రైతులు మోసాలకు గురికాకూడదని, ఇతర దేశాలకు నేరుగా ప్రభుత్వం నుంచే ఎగుమతులు చేసేలా చూడాలన్నారు. దీనివల్ల రైతులకు మేలు జరుగుతుందని సీఎం జగన్ అధికారులకు సూచించారు.

ప్రతి ఆర్బీకేలో ఐదుగురు సిబ్బంది

ధాన్యం, పంటల కొనుగోలు కోసం ప్రతి ఆర్బీకేలో కనీసంగా ఐదుగురు సిబ్బంది ఉండాలన్నారు. టెక్నికల్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇతర సిబ్బంది ముగ్గురు కచ్చితంగా ఉండాలన్నారు. వీళ్లు రైతుల దగ్గరకు వెళ్లి.. వారితో ఇంటరాక్ట్‌ అయ్యి.. కొనుగోలుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలన్నారు. గన్నీ బ్యాగులు, రవాణా వాహనాలు, అవసరమైన హమాలీలను ఈ సిబ్బందే ఏర్పాటు చేయాలన్నారు. వీటికోసం రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండకూడదని, ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో వారికి పేమెంట్లు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. అన్ని కొనుగోలు కేంద్రాలు తెరిచారా? లేదా? అన్నదానిపై వచ్చే మూడు నాలుగు రోజుల్లో దృష్టి పెట్టాలన్నారు. పంటల కొనుగోలు సంబంధిత సమస్యలపై ఫిర్యాదులు, విజ్ఞాపనల కోసం ప్రతి ఆర్బీకేలో ఒక నంబర్‌ను ఏర్పాటు చేయాలని తెలిపారు. రైతులతో ఇంటరాక్షన్, నిరంతర చర్చలు అధికారులు జరపాలని సూచించారు. జిల్లాల్లో ఉన్న జేసీల నుంచి పంటల కొనుగోలుపై నిరంతర ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.

సీసీఆర్సీ కార్డ్స్‌పై అవగాహన

సీసీఆర్సీ కార్డ్స్‌ (క్రాప్‌ కల్టివేటర్‌ రైట్స్‌ కార్డ్స్‌)లపై నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు. దీని వల్ల రైతుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదని, ఈ విషయాన్ని రైతులకు అర్థమయ్యేలా చెప్పాలని పేర్కొన్నారు. రోజుకు సగటున ధాన్యం కొనుగోలు 42,237 మెట్రిక్‌ టన్నులకు చేరిందని, రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా కొనుగోళ్లు జరుగుతాయన్నారు. ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఆహార, పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని, సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి మధుసూధనరెడ్డి, సివిల్‌ సప్లయిస్ కమిషనర్‌ గిరిజాశంకర్, వ్యవసాయశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed