నాన్న పంచెకట్టులో నిండైన తెలుగుదనం : సీఎం జగన్

by srinivas |
నాన్న పంచెకట్టులో నిండైన తెలుగుదనం : సీఎం జగన్
X

దిశ, ఏపీ బ్యూరో: ‘భూమి మీద ఉంటూ ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన మహానేత దివంగత సీఎం వైయస్‌ రాజశేఖర్ రెడ్డి. నాన్న పంచెకట్టులో నిండైన తెలుగుదనం, వ్యవసాయం మీద మమకారం, పల్లె, పేదల మీద గుండె నిండా అభిమానం తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరినీ పెద్దచదువులు చదివించాలనే తపన, ప్రతి ప్రాణాన్ని నిలబెట్టాలనే ఆరాటం.. వీటన్నింటికీ నిలువెత్తు నిదర్శనం వైయస్‌ఆర్‌’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు. ‘వైయస్ఆర్ ఎంతో గొప్పవారని..అందుకే నేడు ఆయన పేరుమీద రాష్ట్రస్థాయి అత్యున్నత పౌర పురస్కారాలు వైయస్‌ఆర్‌ లైఫ్‌ టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డులు, వైయస్‌ఆర్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డులు ప్రదానం చేస్తున్నట్లు వెల్లడించారు. తెలుగుజాతిలో మాణిక్యాలను, మకుటాలను, మహానుభావులను సత్కరించడం దేవుడు నాకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను’ అని సీఎం వైయస్‌ జగన్‌ తెలిపారు. విజయవాడలోని ఏ–కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన వైయస్‌ఆర్‌ లైఫ్‌ టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డులు, వైయస్‌ఆర్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డులు ప్రదానోత్సవానికి గవర్నర్‌ బీబీ హరిచందన్, సీఎం వైయస్‌ జగన్‌, వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

కేంద్రం తరహాలోనే రాష్ట్రంలోనూ అవార్డులు

‘ఎందరో మహానుభావుల మధ్య సామాన్యులుగా ఉన్న అసమాన్యుల మధ్య నా సమయం గడుపుతున్నందున చాలా సంతోషంగా ఉంది. ఎందరో మహానుభావులు.. అందరికీ నా తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, తెలుగు జాతి తరఫున వందనాలు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. కేంద్ర ప్రభుత్వం ఏటా వివిధ రంగాల్లో గొప్ప వారిని, మంచివారిని అత్యున్నత పద్మశ్రీ, పద్మభూషణ్, భారతరత్న వంటి అవార్డులనిచ్చి సత్కరిస్తుంది. అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వైయస్‌ఆర్‌ అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. భూమి మీద ఉంటూ ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ఆ మహామనిషి దివంగత సీఎం వైయస్‌ రాజశేఖరరెడ్డి పేరు మీద అవార్డులను ప్రదానం చేస్తున్నాం’ అని జగన్ చెప్పుకొచ్చారు.

పారదర్శకంగా అవార్డులు

‘వైయస్‌ఆర్‌ లైవ్‌ టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డులు పొందినవారికి రూ.10 లక్షల నగదు, కాంస్య విగ్రహం, మెమెంటో, యోగ్యతాపత్రం..వైయస్‌ఆర్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డులు పొందినవారికి రూ.5 లక్షల నగదు, కాంస్య విగ్రహం, యోగ్యతాపత్రం ఇవ్వడం జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నింటిని పారదర్శకంగా అమలు చేస్తున్నాం. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి పేదవాడికి అత్యంత పారదర్శకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఎంతో పారదర్శకంగా విజేతలను ఎంపిక చేశాం. రాష్ట్ర చరిత్రలో డీమోస్ట్‌ ఇంపార్షల్‌ అవార్డులను అందిస్తున్నాం. ఇవి మన తెలుగుకు, మన సంస్కృతికి, మన కళలకు, మనలో ఉన్న మానవతా మూర్తులకు ఇస్తున్న గొప్ప అవార్డులుగానే భావిస్తున్నాం. ఎందరికో స్ఫూర్తినిస్తున్న మహోన్నత సంస్థలు, వ్యక్తులకు ఈ అవార్డులు ప్రదానం చేస్తున్నాం’ అని సీఎం జగన్ అన్నారు.

వెలకట్టలేని ప్రతిభకు సలాం

‘సామాన్యులుగా కనిపించే అసమాన్యులకు వందనం చేస్తూ.. వారి వెలకట్టలేని ప్రతిభకు సలాం చేస్తూ ఈ అవార్డులను ప్రకటించాం. తెలుగువారికి, ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్లు అయిన కళలకు, సంస్కృతికి ఈ అవార్డుల్లో పెద్దపీట వేసినట్లు సీఎం జగన్ తెలిపారు. పండించే రైతన్నకు, మనదైన వ్యవసాయానికి, ఉద్యానవన ఉద్యమానికి, వ్యవసాయ అనుబంధ రంగాల్లో వస్తున్న విప్లవానికి.. కలం యోధులైన కవులకు, స్త్రీవాద ఉద్యమానికి, ఛాందసత్వం మీద భావాల దాడులకు, సామాజిక స్పృహను మేల్కొల్పడంలో మేరుపర్వత సమానులైన రచయితలకు, విశ్లేషక పాత్రికేయులకు ఇస్తున్న గొప్ప అవార్డులని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. కొవిడ్‌ సమయంలో ఆస్పత్రుల్లో అన్నీ తామై.. తామే కుటుంబమై.. వారాలు, నెలల పాటు తమ కుటుంబాలకు దూరమై.. ప్రాణాలకు తెగించి అసమానమైన సేవలందించిన మానవతామూర్తులకు ఈ అవార్డులు అందిస్తున్నామని ఇలాంటి యోధులను సత్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నా’నని సీఎం జగన్ అన్నారు.

Next Story

Most Viewed