- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఎమ్మెల్యేలకు జగన్ ఝలక్.? పదవులకు రాజీనామా చేయాలని ఆదేశం
దిశ, ఏపీబ్యూరో : ఏపీలో త్వరలో ఉపఎన్నికలు జరగబోతున్నాయా..? ఇతర పార్టీల నుంచి గెలుపొంది వైసీపీకి అనుబంధంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందేనా..? వైసీపీ కండువా కప్పుకోవాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలవడం తప్పనిసరా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీ చేర్చుకుంది. అందులో కొంతమందికి మంత్రి పదవులను సైతం కట్టబెట్టింది. దీంతో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పార్టీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యేలను మరో పార్టీ ఎలాకొనుగోలు చేస్తుందని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే విశ్వసనీయ రాజకీయాలకు కట్టుబడి ఉంటామని.. రాజకీయాల్లో విలువలే తమకు ముఖ్యమంటూ నాడు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇదే విషయాన్ని పదేపదే ప్రస్తావించారు.
తీరా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు వైసీపీకి అనుబంధంగా మారారు. దీంతో జగన్ వారిని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలుపొందాలని ఆదేశిస్తున్నారట. ప్రజాభీష్టం తీర్పునకు తాను కట్టుబడి ఉంటానని సీఎం జగన్ తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు రాబోయే ఆరు నెలల్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. ఈ ఉపఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలను కేబినెట్‌లోకి కూడా తీసుకునే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందిన ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌లు వైసీపీకి అనుబంధంగా మారిపోయారు. మరోవైపు జనసేన పార్టీ నుంచి గెలుపొందిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సైతం వైసీపీకి అనుబంధంగా మారిపోయారు. వీళ్లను అధికారికంగా పార్టీలో చేర్చుకోవాలంటే టీడీపీ, జనసేన పార్టీల సభ్యత్వం వదులుకోవాలి. ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలి అని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. వీరితోపాటు విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇప్పటికే తన రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపించారు. గంటా కూడా వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే ఆయన చేరకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ నియోజకవర్గానికి కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది.
మెుత్తం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అభ్యర్థులు గెలుపొందడం అంత ఈజీ కాదని తెలుస్తోంది. గన్నవరం, చీరాల నియోజకవర్గాల్లో అధికార పార్టీ నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయిన నేతలు సహాయ నిరాకరణ చేసే అవకాశం ఉంది. ఇకపోతే రాజోలు నియోజకవర్గంలో కూడా వైసీపీ నేతలు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. రాజోలు వైసీపీలో మూడు వర్గాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాపాక వరప్రసాదరావు గెలుపొందడం కష్టమేనని తెలుస్తోంది. మెుత్తానికి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. మరి ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో అనేది తెలియాలంటే మరికొన్ని నెలలపాటు వేచి చూడాల్సిందే.