లాక్‌డౌన్‌పై సీఎం జగన్ సమీక్ష

by srinivas |
లాక్‌డౌన్‌పై సీఎం జగన్ సమీక్ష
X

లాక్‌డౌన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధం నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నీ, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులతో చర్చించారు.

కరోనా వైరస్ సమూహాల నుంచి వ్యాప్తి చెందుతున్న నేపధ్యంతో పాటు లాక్‌డౌన్ ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతోందన్న అంశాలను ఆరాతీశారు. నిత్యావసర సరకుల కోసం ప్రజలు ఒకే సమయంలో పెద్దఎత్తున గుమికూడడం వల్ల సామాజిక దూరం లక్ష్యానికి తూట్లు పడుతున్నాయని అభిప్రాయపడ్డారు. సామాజిక దూరం పాటిస్తూ నిత్యావసర సరకులు అందేలా చేయడం ఎలా? అన్నదానిపై చర్చించారు.

దీంతో పట్టణాలు, పల్లెలన్న తేడా లేకుండా పెద్ద ఎత్తున రైతు బజార్లను నిర్వహించాలని నిర్ణయించారు. ఒకే చోట కాకుండా ప్రాంతాల వారీగా కూరగాయలు అమ్మేలా చర్యలు తీసుకోవాలని, దూకాణాల ఏర్పాటు నిర్ణీత దూరం జరిగేలా చూడాలని అభిప్రాయపడ్డారు. ప్రతి దుకాణం వద్ద సామాజిక దూరం పాటించేలా మార్కింగ్‌ చేయాలని కూడా నిర్ణయించారు. నిత్యావసరాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అన్నారు.

సరకులు కొనుగోలు వేళలు ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్ణయిస్తే ప్రజలకు ఆందోళన తగ్గుతుందని భావిస్తున్నారు. పాలు వంటి పదార్థాలు అందుబాటులో ఉంచాలని, ఇతర సరకులకు కూడా 2 లేదా 3 కిలోమీటర్ల దూరాన్ని మించి బయటకు రాకూడదని నిర్ణయించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్‌ రోజంతా అమల్లో ఉంటుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో నలుగురికి మించి గుమి కూడరాదని తెలిపారు.

అలాగే సరకు రవాణాకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరల రేట్లు జిల్లాల వారీగా టీవీలు, పేపర్లలో ప్రకటించాలని, ధరలు పెంచి అమ్మితే 1902కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఫిర్యాదులందగానే చర్యలు తీసుకుని, ఆ చర్యలు టీవీల్లో ప్రకటించాలని చెప్పారు. కూరగాయలు లోడింగ్, అన్ లోడింగ్ చేసే హమాలీలకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం అధికారులు ఆదేశించారు.

Tags :ap cm, jagan, review meeting, cs neelam sahani, dgp gautam sawang, jawaharlal

Advertisement

Next Story