ఆజాద్ స్ఫూర్తితో విద్యా విధానం: జగన్

by srinivas |
ఆజాద్ స్ఫూర్తితో విద్యా విధానం: జగన్
X

దిశ, ఏపీ బ్యూరో: ఆజాద్​ స్ఫూర్తితో ప్రతీ పేద విద్యార్థికి చక్కటి వసతులతో కూడిన విద్యనందిస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతిని పురస్కరించుకొని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలాం జయంతిని జాతీయ విద్యా, మైనార్టీ సంక్షేమ దినోత్సవంగా జగన్ ప్రకటించారు.

అనంతరం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. దేశంలో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలను అబుల్‌ కలాం హయాంలో స్థాపించారని గుర్తు చేశారు. ప్రాథమిక స్థాయి నుంచి వర్సిటీ విద్య వరకు అబుల్‌ కలాం అనేక సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ పేద విద్యార్థులకు మంచి చదువు అందించేలా నాడు-నేడు కార్యక్రమం అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇంగ్లీష్ మీడియంలో బోధించేలా మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులకు వసతి దీవెన అందిస్తున్నామన్నారు.

చంద్రబాబు పై విమర్శలు:

ఇదే సమయంలో చంద్రబాబు, టీడీపీ జగన్ విమర్శలు చేశారు. మైనార్టీలపై ట్విట్టర్‌, జూమ్ యాప్‌లల్లో మాత్రమే చంద్రబాబు ప్రేమ చూపిస్తున్నారని విమర్శలు సంధించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు పాలనలో కేవలం రూ.2500 కోట్లు మాత్రమే మైనార్టీల సంక్షేమానికి కేటాయించినట్లు సీఎం గుర్తు చేశారు. వక్ఫ్ ఆస్తులను డిజిటలైజ్ చేస్తున్నట్లు తెలిపారు. క్రిస్టియన్ మిషనరీ ఆస్తులను కూడా ప్రభుత్వం కాపాడుతుందని భరోసా ఇచ్చారు. మదర్సాలకు అమ్మ ఒడిని అనుసంధానించామన్నారు. వచ్చే ఏడాది నుంచి పెళ్లి కానుక అమలు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ భాషా, మంత్రులు మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, కొడాలి నాని, సీఎస్‌ నీలం సాహ్ని పాల్గొన్నారు.

బెయిల్ పిటిషన్ వేసింది వాళ్లే:

నంద్యాల ఘటనపై ప్రభుత్వం చట్టబద్దంగా వ్యవహరిస్తే.. టీడీపీ వాళ్లే నిందితులకు బెయిల్ ​పిటిషన్​ వేశారని సీఎం జగన్​ తెలిపారు. ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. ఎవరు తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. పోలీసులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. టీడీపీ హయాంలో క్రియాశీలకంగా ఉన్న రామచంద్రరావు నిందితుల తరఫున బెయిల్ పిటిషన్ వేసినట్లు తెలిపారు. న్యాయస్థానంలో నిందితులకు బెయిల్‌ మంజూరైతే రద్దు చేయాలని తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సీఎం వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed