త్యాగాల తెలంగాణ కార్పొరేట్ కోసమా? : భట్టి

by Shyam |
CLP leader Bhatti Vikramarka
X

దిశ, ధర్మపురి: నీళ్లు, నిధులు, నియామకాల కోసం త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ కార్పొరేట్ సంస్థల కోసమా అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ ధోరణి మారకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. శనివారం ధర్మపురి క్షేత్రంలోని హరితా హోటల్‌ల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకొస్తే వాటికి కేసీఆర్​ సంపూర్ణ మద్దతిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని, సీఎం కేసీఆర్‌కు కాంట్రాక్టర్ల నుంచి వేల కోట్ల రూపాయలు అందుతున్నాయని ఆరోపించారు. రాష్ర్టంలో కొనుగోలు కేంద్రాలు బంద్ చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.

ఇప్పటికైనా సీఎం కేసీఆర్​రైతు వ్యతిరేక విధానాలను మార్చుకోవాలని, లేకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు అనుకూలంగా ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు టీఆర్‌ఎస్ ప్రభుత్వం గత ఏడేళ్లుగా విడుదల చేయలేదన్నారు. కేసీఆర్‌పై కేసులు పెడుతామని, జైల్‌లో తోయిస్తామని బండి సంజయ్‌ మాటలకే పరిమితమవుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ ఎంపీ మధుయాష్కీ అన్నారు. ధర్మపురిలో జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులకు మున్సిపల్​ తీర్మానాలు అయ్యాయా? ప్రభుత్వం గజిట్ చేసిందా? అని మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ ప్రశ్నించారు. ఆస్తులు నష్టపోయేవారికి నోటీసులు ఇవ్వకుండా వారి నిర్మాణాలను ఎలా తొలగిస్తారని ఆయన అధికారులను నిలదీశారు.

Advertisement

Next Story