కమీషన్ల కోసమే కాళేశ్వరం.. కేసీఆర్‌పై భట్టి ఫైర్

by Shyam |
కమీషన్ల కోసమే కాళేశ్వరం.. కేసీఆర్‌పై భట్టి ఫైర్
X

దిశ, కాటారం: ప్రాణహిత-చేవెళ్ల పేరు మార్చి రూ. వేల కోట్లు దండుకునేందుకే కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కేంద్ర ప్రభుత్వ చట్టాలపై నిరసన వ్యక్తం చేస్తూ.. ప్రమాదకర చట్టాలపై రైతు ముఖాముఖి కార్యక్రమం శుక్రవారం కాళేశ్వరం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కమీషన్ల కోసం ఆంధ్ర కాంట్రాక్టర్లకు రాష్ట్ర సంపద దోచి పెడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్లతో తెలంగాణలో ఒక్క ఎకరం కూడా సాగు చేయలేదని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎల్లంపల్లి, ఎస్ఆర్ఎస్టీ ప్రాజెక్టు నుంచే నీటిని వినియోగించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తి పోసిన నీటిని మళ్లీ కిందికి మళ్లించడం తప్ప, ఈ ప్రాజెక్టుతో ఎలాంటి ఉపయోగం లేదన్నారు.

అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కేవలం రూ.38 వేల కోట్లతో 16 లక్షల ఎకరాలకు సాగు నీరందించే విధంగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల తరపున నిలుస్తుందని తెలిపారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రారంభించి సంవత్సరాలు గడుస్తున్నా పనులు పూర్తి కాకపోవడం పై మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్రంగా మండిపడ్డారు. వచ్చే శివరాత్రిలోపు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పొదెం వీరయ్య, మాజీ ఎంపీ మధుయాష్కి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story