దేశంలో మార్మోగుతున్న ‘టూల్‌కిట్’.. యాక్టివిస్ట్ దిశారవి అరెస్టు!

by Anukaran |   ( Updated:2021-02-15 08:24:18.0  )
దేశంలో మార్మోగుతున్న ‘టూల్‌కిట్’.. యాక్టివిస్ట్ దిశారవి అరెస్టు!
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం దేశంలో ఫార్మర్స్ ప్రొటెస్ట్ ‘టూల్‌కిట్’ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. కేంద్రం తెచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే రైతుల డిమాండ్లను తాము పరిష్కరిస్తామని, కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ అగ్రి చట్టాలను రద్దు చేసే ప్రసక్తి లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెగేసి చెప్పారు. ఇదే విషయంపై ప్రధాని మోడీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో స్పందిస్తూ.. సాగు చట్టాలను సపోర్టు చేయడంతో పాటు వీటి వలన రైతులకు మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు.

‘టూల్‌కిట్’ను ఎవరు తెచ్చారు..

టూల్‌కిట్.. ఈ పదాన్ని మొదట 18ఏళ్ల స్వీడీష్ ‘ఎన్విరాన్ మెంటల్ యాక్టివిస్ట్ గ్రేటా థన్‌బర్గ్’ వాడారు. వాతావరణంలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులపై ఆమె ప్రపంచవ్యాప్తంగా ఉద్యమానికి తెరలేపారు. అభివృద్ధి చెందిన దేశాలు పర్యావరణ హితానికి చర్యలు చేపట్టాలని 2019 సెప్టెంబర్‌లో జరిగిన UN ప్రతినిధుల సభలో తనదైన వాయిస్ వినిపించి ప్రపంచ దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించారు. ఈ నేపథ్యంలోనే ఇండియాలో జరుగుతున్న రైతుల నిరసనలు, వాటిని అదుపు చేసేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలపై ఆమె తొలుత ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘రైతులకు తన పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు’’ ట్వీట్ చేశారు. దీనిపై కొందరు ఆమెను సపోర్టు చేయగా, మరికొందరు తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని సూచించారు. ప్రతిస్పందనగా ఆమె ‘‘మీ బెదిరింపులను పట్టించుకోనని, తాను రైతులతోనే ఉంటానని’’ స్పష్టంచేశారు.

అయితే, జనవరి 26 హింసాత్మక ఘటన జరగడానికి ముందు ఆమె Toolkit అనే వర్డ్‌ను ఉపయోగించారు. అదికాస్త వైరల్ అవడంతో కొద్దిసేపటికే దానిని డిలీట్ చేశారు. కాగా, ఈ టూల్ కిట్ ఆధారంగానే గణతంత్ర వేడుకల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఆరోపిస్తున్నారు. దీని వెనుక విదేశీ శక్తుల హస్తముందని, రైతు నిరసనలను అడ్డం పెట్టుకుని దేశంలో అశాంతి, అల్లర్లు సృష్టించేందుకు అంతర్జాతీయ స్థాయిలో కుట్రలు జరిగాయని ఇంటెలిజెన్స్ సమాచారంగా పోలీసులు చెబుతున్నారు.

అసలేంటీ టూల్‌కిట్..

టూల్‌కిట్.. రైతుల నిరసనలకు మద్దతు ప్రకటిస్తూ కొన్ని పేజీలతో కూడిన సమాచారాన్ని గ్రేటా థన్‌బర్గ్ ఓ లింక్ రూపంలో ట్విట్టర్ లో షేర్ చేశారు. తొలుత చేసిన లింక్ డిలిట్ చేసి మరల అప్డేట్ లింక్‌ను కూడా ఇచ్చారు. అందులో రైతులు తమ డిమాండ్ల పరిష్కారానికి ఏమి చేయాలి? ప్రజలు ఎలా మద్దతు పలకాలి? ఎక్కడెక్కడ నిరసనలు చేయాలి? సోషల్ మీడియా వేదికగా ఉద్యమం ఎలా నిర్వహించాలి? అనే అంశాలను పేర్కొన్నట్లు తెలుస్తోంది. అందులోని కొన్ని అంశాలు..

1. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు రైతుల నిరసనలకు మద్దతు పలకాలంటే ఈ టూల్‌కిట్ లింక్‌ను క్లిక్ చేసి అందులో సపోర్టు చేయొచ్చు.
2. తమ ఫొటో లేదా వీడియోను #FarmersProtest లేదా #StandWithFarmers అనే దానికి జతపరిచి రైతు ఉద్యమానికి మద్దతు పలకాలని ఆమె సలహా ఇచ్చారు.
3.భారతీయులందరూ పరేడ్ మార్చ్‌లో పాల్గొని రైతు ర్యాలీకి సపోర్టు చేయాలని, అందరూ ఢిల్లీ సరిహద్దులకు చేరుకోవాలని అందులో కోరారు.
4. @PMOIndia, @nstomar (Minister of Agriculture & Farmer Welfare), your own heads of state & others who ought to take note, like the IMF, WTO, FAO, World Bank మొదలగు వాటి అధికార ఖాతాలకు #FarmersProtest Or #StandWithFarmers పేరుతో అదేపనిగా ట్వీట్ చేయాలన్నారు.

ఈ చర్యల అనంతరం గ్రేటా థన్‌బర్గ్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 153ఏ ప్రకారం దేశంలో వివిధ జాతులు, మతాల మూలాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రయత్నించినందుకు,
సెక్షన్ 120బి నేరపూరిత కుట్రకు తెరలేపారని అభియోగం మోపారు.

క్లైమేట్ యాక్టివిస్ట్ దిశారవి అరెస్టు.. ఎందుకు?

బెంగళూరులోని 21ఏళ్ల వాతావరణ ఉద్యమకారిణి దిశా రవిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. కారణం గ్రేటా షేర్ చేసిన ‘టూల్‌కిట్’ లింక్స్ రూపకల్పనలో ఆమె పాత్ర ఉందని అభియోగం మోపారు. జనవరి 26న హింసాత్మక అల్లర్లు జరగడానికి కారణమైన టూల్‌కిట్‌ను దిశా రవి షేర్ చేయడమే కాకుండా తయారీలో ముఖ్యభూమిక పోషించినట్లు తమ వద్ద సాక్ష్యాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఆ లింక్స్ మూలాలు ఖలిస్తాన్ వేర్పాటువాదులకు చెందినవని కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెను కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం 5రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే, రైతులకు మద్దతుగా మాత్రమే ఆ లింక్స్‌ను షేర్ చేశానని, తనకు ఏ పాపం తెలీదని కోర్టు హాల్‌లో దిశా రవి బోరున విలపించినట్లు సమాచారం. ఈమె ‘ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ గ్లోబల్ మూవ్‌మెంట్’ పేరుతో ఉద్యమాన్ని నడిపిస్తోంది. పిల్లలు ప్రతీ శుక్రవారాల్లో తరగతులను బహిష్కరించి వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేయాలని పిలుపునిచ్చారు. కాగా, దిశా రవి బెంగళూరులోని మౌంట్‌ కార్మెల్ కాలేజ్ లో చదువుతోంది.

Advertisement

Next Story

Most Viewed