సునంద పుష్కర్ కేసులో ట్విస్ట్ ఇచ్చిన కోర్టు.. ఎంపీ శశిథరూర్‌ కు ఊరట..

by Anukaran |   ( Updated:2021-08-18 01:39:24.0  )
సునంద పుష్కర్ కేసులో ట్విస్ట్ ఇచ్చిన కోర్టు.. ఎంపీ శశిథరూర్‌ కు ఊరట..
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ కు ఊరట లభించింది. ఆయన భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో ఆయనపై ఉన్న ఆరోపణలను కోర్టు కొట్టిపారేసింది. దీంతో ఈ కేసులో ఆయనకు క్లీన్ చిట్ ఇస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు స్పెషల్ జడ్జి గీతాంజలి గోయల్ తీర్పును వెలువరించారు. సునందా పుష్కర్ జనవరి 17, 2014 రాత్రి ఢిల్లీలోని ఒక లగ్జరీ హోటల్ సూట్‌లో శవమై కనిపించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమె భర్త శశి థరూర్ ప్రధాన నిందితుడిగా కనిపించారు. సునందా పుష్కర్ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని.. ఆమె భర్త శశిథరూరే చంపేశారని ఆమె తల్లిదండ్రులు కేసు పెట్టారు.

తమ కూతురుని మానసికంగా వేధించాడని, వేరొక యువతితో సంబంధం పెట్టుకొని తమ కూతురుని చిత్రహింసలకు గురిచేసినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో శశి థరూర్‌పై ఢిల్లీ పోలీసులు ఆత్మహత్య, క్రూరత్వ ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసు పై కోర్టులో శశిథరూర్‌ న్యాయవాది సీనియర్ అడ్వకేట్ వికాశ్ పాహ్వా వాదించారు. తన క్లయింట్ భార్యను హింసించలేదని, ఫోరెన్సిక్‌, మెడికల్ రిపోర్టులో కూడా శశిథరూర్‌ కి విరుద్ధంగా ఆధారాలు లేవని వాదించారు. నాలుగేళ్ల విచారణ తర్వాత కోర్టు శశిథరూర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆయన మీద ఆరోపణలను కొట్టిపారేసింది. చార్జిషీట్‌లో సరైన ఆధారాలు లేవంటూ శశిథరూర్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ.. తీర్పును వెల్లడించింది.

Advertisement

Next Story