దటీజ్ ఫ్రెండ్‌షిప్.. జర్నలిస్టు కుటుంబానికి అండగా నిలిచిన క్లాస్‌మేట్స్

by Sridhar Babu |
Karimnagar-Friends
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : కరోనా మహమ్మారి నిన్ను బలితీసుకున్నా నీ కుటుంబానికి మాత్రం బాసటగా నిలుస్తామని చేతల్లో నిరూపించారు. కలిసి చదువుకున్న నాటి అనుబంధాలను మర్చిపోకుండా ఆ కుటుంబానికి బాసటగా నిలిచి ఆదర్శంగా నిలిచారు. రెండు దశాబ్దాల క్రితం సహచర విద్యార్థులుగా ఒకే చోట విద్యనభ్యసించిన వారంతా ఆ కుటుంబానికి చేయూతనిచ్చారు.

కరోనా సోకి చికిత్స పొందుతూ ఉగాది పర్వదినం రోజునే కరీంనగర్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు ఎస్‌వి. జయప్రకాష్ మృత్యువాత పడ్డారు. పెద్దదిక్కుగా ఉన్న జయప్రకాష్ మరణంతో ఆయన కుటుంబం తీవ్ర మనోవేదనకు లోనైంది. ఈ విషయాన్ని గమనించిన అతని క్లాస్‌మేట్స్ తమవంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. లయోలా హై స్కూల్ 1984- 85 బ్యాచ్ పదవ తరగతి క్లాస్‌మేట్స్ రూ. 3.50 లక్షల ఆర్థిక సాయాన్ని జయప్రకాష్ కుటుంబ సభ్యులకు అందజేశారు.

కరీంనగర్‌లో ఉంటున్న జయప్రకాష్ క్లాస్‌మేట్స్‌తో పాటు మిత్రులు కూడా తమవంతుగా సాయం అందించారు. భవిష్యత్తులో కూడా అతని కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా లయోలా హై స్కూల్ 84-85 పదోతరగతి బ్యాచ్ కన్వీనర్ జక్కుల చంద్రప్రకాష్, కో కన్వీనర్ ఈఎస్ఎస్ఎన్ఆర్‌వీ రమణ తెలిపారు. జయ ప్రకాష్ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో వంగల పవన్ కుమార్, ఉప్పుల అంజనీ ప్రసాద్, చంద్రశేఖర్ రావు, కే శ్రీనివాస్, నారాయణ శర్మ, టీవీ రమణ రావు, నరేందర్ రావు, సహచర జర్నలిస్టు ఈద మధూకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story